ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల రికవరీ, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ 3 రోజుల నష్టాల నుంచి గట్టెక్కింది. సెన్సెక్స్ 261 పాయింట్లు పెరిగి 66,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 19,812 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లోనే కదలాడాయి.
ఒక దశలో సెన్సెక్స్ 393 పాయింట్లు పెరిగి 66,560 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు బలపడి 19,850 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే చివర్లో పలు రంగాల్లో లాభాల స్వీకరణతో స్వల్పంగా లాభాలు కోల్పోయాయి. బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు వరుసగా 0.70%, 0,40% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.264 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.113 కోట్ల షేర్లు కొన్నారు. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆశావహన అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి
- సెప్టెంబర్ క్వార్టర్‌లో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో సియట్ లిమిటెడ్ షేరు 4.50% లాభపడి రూ.2,197 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 11% దూసుకెళ్లి రూ.2,334 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది క్యూ2 సంస్థ నికర లాభం రూ.6.4 కోట్లుగా ఉంది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.388 కోట్లు పెరిగి రూ. 8,887 కోట్లకు చేరింది.
- కల్యాణ్ జ్యువెల్లర్స్ కంపెనీ షేరు 4.09% లాభపడి రూ.295 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.298 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,000 కోట్ల మైలురాయిని అధిగమించి రూ.30,422 కోట్లకు చేరింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేరు 133% దూసుకెళ్లింది.
- రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు కనబరచడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 1% పెరిగి రూ.1,541 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 2% ర్యాలీ చేసి రూ.1,558 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
- ఎల్రక్టానిక్ సేవల తయారీ సంస్థ సైయెంట్ డీఎల్‌ఎం షేరు 3% ఎగసి రూ.709 వద్ద స్థిరపడింది. క్యూ2 లో కంపెనీ నికర లాభం 106% వృద్ధి చెందడం షేరు ర్యాలీకి కారణమైంది. ట్రేడింగ్‌లో 8.50% ఎగసి రూ.748 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment