
వలసేతర వీసాలను స్వదేశం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచన
చాంతాడంత షెడ్యూలింగ్ లైన్లతో ఆలస్యంకానున్న వీసాల జారీ
భారతీయులకు పెరగనున్న నిరీక్షణ కష్టాలు
వాషింగ్టన్: కోవిడ్ సంక్షోభం వేళ త్వరగా వలసేతర వీసాల జారీ ప్రక్రియను ముగించాలనే సదుద్దేశంతో భారతీయులకు కల్పించిన ఒక చక్కటి వెసులుబాటుకు అమెరికా సర్కార్ హఠాత్తుగా మంగళం పాడింది. దీంతో భారతీయ వీసా దరఖాస్తుదారులకు మళ్లీ నిరీక్షణ కష్టాలు పెరగనున్నాయి. భారత్‌లోని వీసా ఇంటర్వ్యూ కేంద్రాల్లో భారీ షెడ్యూలింగ్ జాబితా ఉండటంతో విదేశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునేందుకు కోవిడ్ వేళ అమెరికా అనుమతిచ్చింది. దాంతో భారతీయులు చాలా మంది విదేశాలకు వెళ్లి అక్కడి అమెరికా కాన్సులేట్లు, రాయబార కార్యాలయాల్లో వీసా ఇంటర్వ్యూలను త్వరగా ముగించుకుని వీసాలను సాధించారు.
ఇకపై అలా కుదరదని ఏ దేశం వాళ్లు ఆ దేశంలోనే దరఖాస్తు చేసుకోవాలని, అక్కడే ఇంటర్వ్యూలను పూర్తిచేసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో స్వదేశంలో వీసా అపాయింట్‌మెంట్‌ల షెడ్యూలింగ్ మరింతగా పెరగనుంది. దరఖాస్తుదారులు తమ వంతు వచ్చేదాకా వేచిచూడాల్సిన నిరీక్షణ కాలం ఊహించనంతగా పెరిగిపోనుంది. త్వరగా వీసా పొంది అమెరికాలో వాలిపోదామనుకున్న భారతీయ వలసేతర వీసా దరఖాస్తు దారుల ఆశలు అడియాసలు కానున్నాయి.
‘‘వలసేతర వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇకపై కచ్చితంగా స్వదేశంలో లేదంటే రెసిడెన్సీ హోదా ఎక్కడ ఉందో ఆ ప్రాంతం నుంచే దరఖాస్తు చేసుకోవాలి. విదేశాలకు వెళ్లి దరఖాస్తు చేయడం కుదరదు’’అని తాజా నోటిఫికేషన్‌లో అమెరికా విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. పర్యాటకం(బీ2), వ్యాపారం(బీ1), విద్యార్థి, తాత్కాలిక ఉద్యోగులుసహా అన్ని వలసేతర వీసా విభాగాల దరఖాస్తుదారులకు తాజా సవరణ వర్తిస్తుందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ‘‘నిబంధనలు మారాయని తెల్సి కూడా విదేశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే అక్కడి నుంచి వీసా అనుమతి రావడం గగనమే. అర్హత సాధించడం చాలా కష్టం. ఒకవేళ దరఖాస్తును స్వీకరించి, పరిశీలించినా నిరీక్షణకాలం ఎంతనేది చెప్పలేం. విదేశాల నుంచి చేసే దరఖాస్తుకు సంబంధించిన ఫీజు రీఫండ్ చేయడంగానీ స్వదేశంలో దరఖాస్తు చేసినట్లుగా ఆ ఫీజును పరిగణించడంగానీ జరగదు’’అని అమెరికా ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!
వీసా షాపింగ్ భారతీయులకు కష్టమే
తాత్కాలిక వీసా ఇంటర్యూల తంతును పూర్తిచేసుకోవాలంటే భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కనీసం మూడున్నర నెలలు వేచి ఉండక తప్పని పరిస్థితి ఉందని వీసా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో స్వదేశం నుంచి కాకుండా ఇతర దేశానికి వెళ్లి అక్కడి నుంచి యూఎస్ వీసా కోసం దరఖాస్తు భారతీయుల సంఖ్య ఎక్కువైంది. ఇలా ‘వీసా షాపింగ్’చేసే భారతీయులకు ఇప్పుడు సమస్యలు తప్పవు. భారత్‌లో వీసారావాలంటే వారాల తరబడి వెయిట్ చేయక తప్పదు. అంతకాలం నిరీక్షించే ఓపికలేక థాయ్‌లాండ్, సింగపూర్, జర్మనీ, బ్రెజిల్ వంటి పలు దేశాలకు భారతీయులు పొలోమని వెళ్తున్నారు. అక్కడ త్వరగా వీసా సాధించి లబి్ధపొందిన ఉదంతాలు కోకొల్లలు. వలసేతర వీసా ఇంటర్వ్యూ కోసం 14 ఏళ్ల లోపు చిన్నారులు మొదలు 79ఏళ్లు పైబడిన వృద్దులదాకా తప్పనిసరిగా స్వయంగా వచ్చి కాన్సులేట్ ఆఫీసర్ ఎదుట హాజరవ్వాల్సిందే.