న్యూఢిల్లీ: క్రోనీ రుణ మంజూరీలకు దూరంగా ఉండాలని, అధిక నాణ్యత రుణ మంజూరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం ఫైనాన్షియల్ సంస్థలకు మంగళవారం పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి సంబంధించి విలువైన ఆస్తుల సృష్టికి అధిక నాణ్యతతో కూడిన రుణాలు దోహదపడతాయని అన్నారు. తద్వారానే దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా నడిపించవచ్చని సూచించారు. నచ్చిన వాళ్లకు లేదా రాజకీయ నాయకుల ప్రభావానికి గురై ఇతర ఎటువంటి అంశాలనూ పరిశీలనలోకి తీసుకోకుండా మంజూరు చేసే రుణాలను ‘క్రోనీ లెండింగ్’గా పరిగణిస్తారు. ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే...
►నాణ్యత లేని పేలవ రుణ మంజూరీ సమస్యను 1990 నుంచీ భారత్ బ్యాంకింగ్ ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి బడా రుణాల విషయంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంటోంది. రుణాలను సకాలంలో తీర్చుతున్న (క్రెడిట్ వర్తీనెస్) వారికి రుణ మంజూరీలు సజావుగా లేవు. అదే సమయంలో క్రోనీ క్యాపిటలిస్టుల విషయంలో రుణ మంజూరీలు సునాయాసంగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌లో మొండిబకాయిలు పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి.
►క్రెడిట్‌వర్తీ లేని ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయడం అంటే, క్రెడివర్తీ కలిగిన రుణ గ్రహీత రుణం పొందడంలో ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే భావించాల్సి ఉంటుంది.
►వృద్ధి బాటలో మూలధనాన్ని తగిన రుణ గ్రహీతకు అందజేయడం ఫైనాన్షియల్ రంగం విధి.
►మౌలిక రంగంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితలు కూడా బ్యాంకింగ్ మొండిబకాయిలు పెరిగిపోవడానికి కారణం. అధిక నాణ్యతతో కూడిన రుణాల మంజూరీల విషయంలో ఫైనాన్షియల్ రంగం బాధ్యతా ఉంది. ప్రత్యేకించి మౌలిక రంగంలో రుణాల విషయంలో ‘క్రోనీ’ లెండింగ్‌కు ఎంతమాత్రం స్థానం ఉండకూడదు. ఫైనాన్షియల్ రంగ ప్రధాన లక్ష్యంలో ఈ అంశం ఉండాలి.
►ఫైనాన్షియల్ రంగంలో కార్పొరేట్ పాలనా విధానం కూడా మెరుగుపడాలి. ఇది అధిక నాణ్యత కలిగిన రుణ మంజూరీలకు దోహదపడుతుంది. సీనియర్ మేనేజ్‌మెంట్‌కు ప్రోత్సాహకాలకు రుణ నాణ్యత ప్రాతిపదికగా ఉండాలి.
దివాలా చట్రంలో 4000 కంపెనీలు: సాహూ
కార్యక్రమంలో ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఎస్ సాహూ మాట్లాడుతూ, దివాలా చట్రంలో ప్రస్తుతం 4,000 కంపెనీలు ఉన్నాయన్నారు. ఇందులో 2,000 కంపెనీలకు సంబంధించి దివాల ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీల విలువ లిక్విడేషన్ కన్నా అధికంగా ఉందనీ తెలిపారు. కొన్ని కంపెనీల విషయంలో విలువలు లిక్విడేషన్ వ్యాలూకన్నా 300 శాతం వరకూ అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment