సాక్షి,ముంబై: కరోనా కంటే ముందు, తర్వాత కాలంలోను సాంకేతిక ఉద్యోగ నియామకాలు గణనీయంగా పెరిగాయి. వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి విస్తరించడం, వ్యవస్థలోకి కస్టమర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర సంస్థలను అనుసంధానించడానికి పరిష్కారాలను అభివృద్ధి చేయడం వైపు దృష్టి కేంద్రీకరించడం వల్ల కరోనా అనంతరం టెక్ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్‌ఫోర్స్ డెవలపర్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ వంటి నైపుణ్య సాంకేతిక ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని గ్లోబల్ జాబ్ సైట్ ఇన్‌డీడ్ తెలిపింది. జనవరి 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో ఇన్‌డీడ్ ఫ్లాట్‌ఫామ్‌లోని డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొంచించారు. ఈ మధ్య కాలంలో ఆయా విభాగాలలో 150-300 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొంది.
కంపెనీలలో సాంకేతిక సమస్యల పరిష్కారం మీద నిరంతరం ఆధారపడటం, వర్క్ ఫ్రం హోమ్ విస్తరించడం, వ్యాపార సంస్థలు సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం వంటి టెక్ జాబ్స్ పోస్టింగ్స్ వృద్ధికి కారణాలని తెలిపింది. ఫీల్డ్ ఇంజనీర్, సేల్స్ లీడ్, ఎడిటర్ వంటి ఉద్యోగాలకు యాజమాన్యాల నుంచి 55-85 శాతం డిమాండ్ ఉందని పేర్కొంది. బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పుణే, ఢిల్లీ వంటి కీలక మెట్రో నగరాల్లో అన్ని రంగాలలో జాబ్స్ పోస్టింగ్స్ పెరిగాయి. రిటైల్, బిజినెస్ డెవలప్‌మెంట్ జాబ్ పోస్టింగ్ కేంద్రీకృతమైన కోల్‌కత్తాలో మినహా మిగిలిన అన్ని మెట్రో నగరాల్లో టెక్ ఉద్యోగాలలో వృద్ధి ఉందని తెలిపింది. ఈ ఏడాది మార్చితో ఏడాది పూర్తయిన కరోనా మహమ్మారి ప్రభావంతో దేశీయ నియామక కార్యకలాపాల్లో 9 శాతం క్షీణత నమోదయిందని గ్లోబల్ జాబ్ సైట్ ఇన్‌డీడ్ తెలిపింది. కాలర్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు విపరీతంగా క్షీణించాయి. కరోనా తర్వాతి నుంచి ప్రపంచం డిజిటల్ భవిష్యత్తు వైపు శరవేగంగా పరుగులు పెడుతోందని ఈ డేటా విశ్లేషించిందని ఇన్‌డీడ్ ఇండియా ఎండీ శశి కుమార్ తెలిపారు. అన్ని రంగాలలో షాపింగ్, రిమోట్ వర్కింగ్ టెక్ డెవలపర్లకు ప్రాముఖ్యత సంతరించిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment