టాటా గ్రూప్ వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ను తెలిపారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ తయారీ విభాగాల్లో ఉద్యోగార్థులకు అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్’ అనే అంశంపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత్ లక్ష్యానికి తయారీ రంగం కీలకంగా మారుతుంది. ఈ రంగంలో రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉంది. ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు కల్పించలేకపోతే కేంద్ర ప్రభుత్వం తలంచిన వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోలేము. తయారీ రంగం వృద్ధి దిశగా టాటా గ్రూప్ సంస్థలు వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెంచుతోంది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ రంగాల్లో విభిన్న పరికరాలను తయారు చేసేలా టాటా గ్రూప్ చర్యలు చేపడుతోంది. అందుకోసం రాబోయే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం’ అని చెప్పారు.
ఇదీ చదవండి: గూగుల్ న్యూక్లియర్ పవర్ కొనుగోలు
టాటా గ్రూప్ అస్సాంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్లు ఉన్నాయి. తయారీ రంగం వృద్ధి చెందితే దేశ దిగుమతులు తగ్గుతాయి. అందుకు అనుగుణంగా ఎగుమతులు అధికమవుతాయి. ఫలితంగా రూపాయి విలువ పెరుగుతుంది. దాంతోపాటు ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గుతుంది. దేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే లేఆఫ్స్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. దానికి బదులుగా ఉత్పాదకతను పెంచి ఎగుమతులను మెరుగుపరిస్తే ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగార్థులు కంపెనీలు ఆశించే నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment