భారత్‌లోనే విలువైన బ్రాండ్‌ | Tata Group retained its title as India most valuable brand by Brand Finance | Sakshi
Sakshi News home page

భారత్‌లోనే విలువైన బ్రాండ్‌

Published Thu, Jun 27 2024 3:16 PM | Last Updated on Thu, Jun 27 2024 3:45 PM

Tata Group retained its title as India most valuable brand by Brand Finance

భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌ల్లో టాటా గ్రూప్‌ టాప్‌లో నిలిచింది. ఈ మేరకు బ్రాండ్ ఫైనాన్స్ తాజాగా విడుదల చేసిన విలువైన బ్రాండ్‌ ర్యాంకింగ్స్‌ టైటిల్‌ను టాటా గ్రూప్ దక్కించుకుంది. డిజిటలైజేషన్, ఈ-కామర్స్, ఈవీ, ఎలక్ట్రానిక్స్‌..వంటి రంగాలపై దృష్టి సారించిన ఈ సంస్థ బ్రాండ్‌ విలువ గతంలో కంటే 9 శాతం పెరిగి 28.6 బిలియన్‌ డాలర్ల(రూ.2.3 లక్షల కోట్లు)కు చేరుకుంది. గతేడాది ఈ టైటిల్‌కు దక్కించుకున్న టాటా గ్రూప్‌ ఈసారీ తన స్థానాన్ని నిలుపుకుంది.

బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక ప్రకారం..దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్‌ టాప్‌లో నిలిచింది. 14.2 బిలియన్ డాలర్ల(రూ.1.18 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ మూడో స్థానం (రూ.86 వేలకోట్లు) సాధించింది. గతేడాదిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం అవ్వడంతో ఈ స్థానం దక్కింది. ఎల్‌ఐసీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ గ్రూప్, ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, లార్సెన్ & టూబ్రో, మహీంద్రా బ్రాండ్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

బ్రాండ్‌ ఫైనాన్స్‌  డైరెక్టర్ సావియో డిసౌజా మాట్లాడుతూ..‘టాటా గ్రూప్ దాని అనుబంధ సంస్థల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తోంది. వ్యూహాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) స్పాన్సర్‌షిప్‌లు, ఎయిరిండియా వంటి కంపెనీ వాటాను సొంతం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ డొమైన్‌లో ప్రత్యేకత చాటుకుంటోంది. దాంతో కంపెనీ వినియోగదారులకు మరింత చేరువైంది. భారత్‌లోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా స్థానం సంపాదించింది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: అత్యంత ధనవంతులపై ‘సంపద పన్ను’..?

రంగాల వారీగా చూస్తే టెలికాం రంగం తన బ్రాండ్ విలువలో గతంలో కంటే 61 శాతం వృద్ధి సాధించింది. బ్యాంకింగ్ 26 శాతం, మైనింగ్, ఇనుము, ఉక్కు రంగాలు 16 శాతం చొప్పున వృద్ధి నమోదు చేశాయి. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లలో వెస్ట్‌సైడ్ బ్రాండ్(టాటా గ్రూప్‌- 122 శాతం వృద్ధి) అగ్రస్థానంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement