న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను వీడి రూ. 5,408 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,033 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 78,439 కోట్ల నుంచి రూ. 1,05,932 కోట్లకు ఎగసింది.
ఇక ఇదే కాలంలో స్టాండెలోన్ నికర లాభం రూ. 413 కోట్ల నుంచి రూ. 2,696 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం టర్న్‌అరౌండ్ సాధించింది. రూ. 2,414 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభం ఆర్జించింది. 2021–22లో రూ. 11,441 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,78,454 కోట్ల నుంచి రూ. 3,45,967 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 2 డివిడెండ్ ప్రకటించింది. డీవీఆర్‌కు రూ. 2.1 చెల్లించనుంది.
భారీ పెట్టుబడులు: గతేడాది క్యూ4లో బ్రిటిష్ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) ఆదాయం 49 శాతం జంప్‌చేసి 7.1 బిలియన్ డాలర్లకు చేరింది. పూర్తి ఏడాదికి 25 శాతం అధికంగా 22.8 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించింది. క్యూ4లో 24 శాతం వృద్ధితో 94,649 జేఎల్‌ఆర్ వాహనాలు విక్రయమైనట్లు సంస్థ తాత్కాలిక సీఈవో ఆడ్రియన్ మార్డెల్ తెలియజేశారు. పూర్తి ఏడాదికి 9% అధికంగా 3,21,362 యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు నమోదైనట్లు వెల్లడించారు. ఇక దేశీయంగా ప్యాసింజర్ వాహన హోల్‌సేల్ విక్రయాలు 45 శాతం ఎగసి 5.38 లక్షలను తాకినట్లు టాటా మోటార్స్ పీవీ ఎండీ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. 2023–24లో రూ. 38,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు 0.8 శాతం బలపడి రూ. 516 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment