భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశంలో పర్యటిస్తున్న వేళ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌లో వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అతిపెద్ద భారతీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌కు ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో 1,600 మంది ఉద్యోగులు ఉన్నారు. టీసీఎస్‌కు యూరప్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఫ్రాన్స్ కూడా ఒకటి. యూరప్‌లోని ఇతర దేశాల కంటే ఫ్రాన్స్‌లో కంపెనీ వేగంగా వృద్ధి చెందుతోందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ సప్తగిరి చాపలపల్లి పీటీఐతో పేర్కొన్నారు.
ఫ్రాన్స్‌లో టీసీఎస్ మూడు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉందని రానున్న రోజుల్లో వ్యాపారాన్ని మరింత వేగవంతంగా వృద్ధి చేసేందుకు గ్రౌండ్‌వర్క్ సిద్ధమైనట్లు సప్తగిరి చెప్పారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అన్ని ప్రధాన రంగాలలో 80 ఫ్రెంచ్ క్లయింట్‌లతో టీసీఎస్ పని చేస్తోందని, పారిస్‌లో ఒక ఆవిష్కరణ కేంద్రాన్ని కూడా నడుపుతోందని వివరించారు.
టీసీఎస్‌కు ఫ్రాన్స్‌లో ఉన్న 1,600 మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది పారిస్‌లో ఉన్నారు. వీరిలో 60 శాతం వరకు ఫ్రెంచ్ పౌరులు. కాగా అక్కడే ప్రధాన కార్యాలయం ఉన్న ప్రత్యర్థి కంపెనీ క్యాప్‌జెమినీ ఫ్రెంచ్ మార్కెట్‌లో బలంగా ఉంది. అయితే టీసీఎస్ తన సొంత బలంతో అభివృద్ధి చెందుతుందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment