న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో టెల్కోల ఆదాయంలో వాయిస్ కాల్స్ వాటా 80 శాతం, ఎస్‌ఎంఎస్‌ల వాటా 94 శాతం పడిపోయింది. అయితే, డేటా వాటా 10 రెట్లు పెరిగింది. ఓటీటీలను నియంత్రణ పరిధిలోకి తెచ్చే క్రమంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
2013 జూన్ త్రైమాసికం – 2022 డిసెంబర్ త్రైమాసికం మధ్య కాలంలో గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం.. గత దశాబ్ద కాలంలో మెసేజింగ్, వాయిస్ కమ్యూనికేషన్ కోసం ఓటీటీ యాప్‌ల వినియోగం పెరగడం వల్ల అంతర్జాతీయంగా టెల్కోలకు వాయిస్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే ఆదాయాలు .. క్రమంగా డేటా వైపునకు మళ్లాయి. దేశీయంగా చూస్తే టెల్కోలకు సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయానికి (ఏఆర్‌పీయూ) సంబంధించి డేటా విభాగం తప్ప మిగతా అన్నింటి వాటా తగ్గిపోయింది.
2013 జూన్ క్వార్టర్‌లో టెల్కోల ఆదాయంలో డేటా వాటా 8.1 శాతంగా ఉండగా 2022 డిసెంబర్ త్రైమాసికంలో 10 రెట్లు పెరిగి 85.1 శాతానికి చేరింది. మరోవైపు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడమా లేక నిర్దిష్టంగా కొన్ని కాలింగ్, మెసేజింగ్ యాప్‌లను నిలిపివేయడమా అనే చర్చనీయాంశాన్ని కూడా చర్చాపత్రంలో ట్రాయ్ స్పృశించింది. ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్స్‌ను పూర్తిగా షట్‌డౌన్ చేయడం వల్ల ఎకానమీకే కాకుండా విద్యా, వైద్యం వంటి కీలక సేవలకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అల్లర్లు రేపేందుకు ఉగ్రవాదులు లేదా విద్రోహ శక్తులు ఉపయోగించే అవకాశమున్న నిర్దిష్ట ఓటీటీ యాప్‌లు, వెబ్‌సైట్‌లను మాత్రమే నిషేధించడం శ్రేయస్కరం కావచ్చని ట్రాయ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment