సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ నిర్దిష్ట పరిమితికి మించి జరిపే నగదు లావాదేవీలపై ఒక కన్నేసి ఉంచుతుంది. పరిమితికి మించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే, ఐటీ శాఖ నుంచి నోటీసులు రావచ్చు. ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో చేసే ట్రాన్సాక్షన్స్‌పై ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్‌లో తప్పకుండా సమచారాన్ని అందించాలి. లేదంటే ఐటీ అధికారుల నుండి నోటీసులొచ్చే అవకాశం ఉంది. అలా నోటీసులు రాకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ సమాచారాన్ని ఐటీఆర్ ఫైలింగ్‌లో తెలియజేయాలి.
అధిక-విలువ లావాదేవీలకు సంబంధించి వ్యక్తుల రికార్డులను యాక్సెస్ నిమిత్తం ఐటీ శాఖ అనేక ప్రభుత్వ సంస్థలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యంగా బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ఆస్తి సంబంధిత లావాదేవీలు, షేర్ మార్కెట్ పెట్టుబడులు సహా అధిక-విలువ నగదు లావాదేవీలపై ఐటీ విభాగం నిఘా ఉంచుతుంది. లావాదేవీలు థ్రెషోల్డ్ పరిమితిని మించి ఉంటే సమాచారాన్ని ఐటీఆర్ ఫైలింగ్‌లో పొందుపరచాలి.
టాప్ 5 హై వాల్యూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవో చూద్దాం.
సేవింగ్స్ అకౌంట్ క్యాష్ డిపాజిట్ లిమిట్ ఒక వ్యక్తికి రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ తమ ఖాతాలో పరిమితికి మించి డిపాజిట్ చేస్తే.. నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపవచ్చు. అలాగే కరెంట్ అకౌంట్ లిమిట్‌ను రూ. 50 లక్షలు. ఈ పరిమితి దాటితే ఆదాయ పన్ను శాఖ నోటీసు ఇచ్చి వివరణ కోరవచ్చు.
క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు
ఆదాయపు పన్ను శాఖ అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు నగదు రూపంలో చెల్లించే క్రెడిట్ కార్డ్ బిల్ పరిమితి రూ.1 లక్షగా ఉంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లావాదేవీల పరిమితి దాటితే ఐటీకి సమాచారం అందించాలి. లేదంటే నోటీసులు తప్పవు.
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు
బ్యాంక్ ఎఫ్‌డీలలో 10 లక్షలకు మించిన నగదు డిపాజిట్లపై ఐటీ విభాగానికి తెలియజేయాలి. ఫారమ్ 61Aని ఫైల్ చేయడం ద్వారా సింగిల్ లేదా మల్టిపుల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డిపాజిట్ చేసిన మొత్తం నిర్దిష్ట పరిమితికి మించి ఉంటే బ్యాంకులు లావాదేవీలను బహిర్గతం చేయాలి
స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు
దేశంలోని అన్ని ప్రాపర్టీ రిజిస్ట్రార్లు, సబ్-రిజిస్ట్రార్ వద్ద రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఏదైనా స్థిరాస్తిని విక్రయించడం లేదా కొనుగోలు చేయడం గురించి పన్ను అధికారులకు తెలియజేయడం తప్పనిసరి.
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు, బాండ్లు
మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, బాండ్లు లేదా డిబెంచర్లలో పెట్టుబడులకు సంబంధించిన నగదు లావాదేవీల పరిమితి ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment