న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల్లో కొలువుల సందడి నెలకొంది. కంపెనీలు భారీగా నియామకాలను చేపడుతున్నాయి. కరోనా తర్వాత ఐటీ, డీజిటల్ సేవలకు డిమాండ్ అధికమైంది. భారీగా కాంట్రాక్టులు వస్తుండడంతో వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా కంపెనీలు నిపుణుల వేటలో పడ్డాయి. అగ్రగామి ఐదు ఐటీ కంపెనీలు.. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా 2021 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి–సెప్టెంబర్) 1.7 లక్షల మంది ఉద్యోగులను కొత్తగా తీసుకున్నాయి.
ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) ఎక్కువగా ఉండడం కూడా కంపెనీలకు సౌకర్యంగా లేదు. అదే సమయంలో సేవలకు డిమాండ్ అద్భుతంగా ఉండడం .. ఈ రంగంలో ఉపాధి కల్పనకు దారితీస్తోంది. 2020 మొదటి తొమ్మిది నెలల కాలంలో టాప్–5 ఐటీ కంపెనీల ఉద్యోగుల సంఖ్య 1,125 మేర తగ్గడం గమనార్హం. గతేడాది మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున లాక్‌డౌన్‌లు అమలు కావడం తెలిసిందే. దీంతో కంపెనీలు కొత్త ఉద్యోగులను తీసుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి.
కానీ, గతేడాదికి పూర్తి భిన్నమైన వాతావారణం ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. కరోనాకు ముందు సంవత్సరం 2019 మొదటి తొమ్మిది నెలల్లో అగ్రగామి ఐదు ఐటీ కంపెనీలు 77,000 మందిని నియమించుకోగా.. వీటితో పోల్చి చూసినా ఈ ఏడాది నియామకాలు రెట్టింపునకుపైగా పెరిగినట్టు స్పష్టమవుతోంది. డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకోగా.. అదే సమయంలో సరఫరా పరమైన సవాళ్లను కంపెనీలు ఎదుర్కొంటున్నాయి.
అట్టిపెట్టుకోవడం సవాలే
పరిశ్రమ వ్యాప్తంగా ఉద్యోగుల వలసలు పెరిగిపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 20 శాతానికి పైనే ఉన్నట్టు ప్రకటించాయి. ఇదే స్థాయిలో వలసలు మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగొచ్చని విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్‌గోవిల్ ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. మధ్యస్థాయి ఐటీ కంపెనీలు సైతం ఇదే సమస్యతో సతమతం అవుతున్నాయి.
సరిపడా నిపుణులు అందుబాటులో లేకపోవడం కూడా అధిక వలసలకు కారణంగా ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ సీఈవో సంజయ్ జలోనా పేర్కొన్నారు. ‘‘మా క్లయింట్లు రెండంకెల అట్రిషన్‌ను ఎదుర్కొంటున్నారు. సరిపడా ఉద్యో గులు లభించని పరిస్థితుల్లో ఎన్నో కార్యకలాపాలను ఆటోమేషన్ చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఈ సంస్థ 19.6% అట్రిషన్ రేటును ప్రకటించింది.
సెప్టెంబర్ త్రైమాసికంలోనూ..
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోనే టాప్–5 ఐటీ కంపెనీలు 70,000 మందికి నూతనంగా ఉపాధి కల్పించాయి. 2020 ఇదే కాలంలో 18,000 మందిని తీసుకోగా, 2019లో నియామకాలు 37,000గా ఉన్నాయి. కనీసం మరో రెండు త్రైమాసికాల పాటు అయినా ఈ స్థాయిలో డిమాండ్ కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2021–22 సంవత్సరానికి కొత్తగా 40,000 మందిని తీసుకుంటామన్న టీసీఎస్.. దీన్ని కాస్తా 78,000కు పెంచింది. ఇన్ఫోసిస్ సైతం 26,000 మందికి తీసుకుంటామని, ఈ సంఖ్య ను 45,000కు సవరించింది. విప్రో కూడా 12,000 అంచనాను 26,000కు సవరించింది.
Comments
Please login to add a commentAdd a comment