![Twitter To Restrict Visibility Of Tweets Violating Rules - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/19/tw.jpg.webp?itok=cq-bHKg0)
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా ఉండే ట్వీట్లకు పరిమితులు వర్తింపచేయనున్నట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్ వెల్లడించింది. ఇకపై రూల్స్‌ను అతిక్రమించే ట్వీట్లను చూపడంపై (విజిబిలిటీ) ఆంక్షలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాలసీని అప్‌డేట్ చేసినట్లు వివరించింది. దీని ప్రకారం ముందుగా, విద్వేషపూరిత ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయనిపించే ట్వీట్లను వడగట్టేందుకు ట్విటర్ విజిబిలిటీ ఫిల్టర్‌ను ఉపయోగించనుంది.
ఆ తర్వాత ఇతరత్రా విభాగాలకు కూడా దీన్ని విస్తరించనుంది. అభ్యంతరకరమైన ట్వీట్‌లపై, వాటి విజిబిలిటీ మీద ఆంక్షలు విధించినట్లుగా అందరికీ కనిపించేలా ముద్ర వేస్తారు. అయితే, ఆయా ట్వీట్లను ట్విటర్ తప్పుగా వర్గీకరించిందని వాటిని పోస్ట్ చేసిన యూజర్లు గానీ సంప్రదించిన పక్షంలో పునఃసమీక్షిస్తామని ట్విటర్ పేర్కొంది. అయితే, ట్వీట్ విజిబిలిటీని పునరుద్ధరించేందుకు గ్యారంటీ అంటూ ఉండదని స్పష్టం చేసింది.
సాధారణంగా తాము వాక్‌స్వాతంత్య్రానికి పెద్ద పీట వేస్తామని, సెన్సార్‌షిప్ భయం లేకుండా తమ అభిప్రాయాలు, ఐడియాలను చెప్పేందుకు యూజర్లందరికీ హక్కులు ఉంటాయని ట్విటర్ తెలిపింది. అదే సమయంలో వారందరికీ కూడా తమ ప్లాట్‌ఫామ్ సురక్షితమైనదిగా ఉండేలా తీర్చిదిద్దేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment