ప్రముఖ ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఉబర్ తాజాగా వినియోగదారుడికి రూ.10వేలు పరిహారం చెల్లించాలంటూ చండీగఢ్ కన్జూమర్ ఫోరమ్ తీర్పు చెప్పింది. తక్కువ దూరాలకు సంబంధించిన రైడ్‌లకు ఉబర్ అధికమొత్తంలో ఛార్జీ వసూలు చేస్తుండడంతో అతడు కమిషన్‌ను ఆశ్రయించాడు. పూర్వాపరాలు విచారించిన కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.
మీడియా కథనాల్లోని వివరాల ప్రకారం.. ఆగస్టు 6, 2021న చండీగఢ్‌కు చెందిన అశ్వనీ ప్రశార్ తను ఉన్న ప్రదేశం నుంచి వేరేచోటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాను వెళ్లాలనుకునే ప్రదేశం గూగుల్ మ్యాప్స్‌లో 8.83 కిలోమీటర్లుగా చూపించింది. దాంతో ఉబర్ బుక్ చేయాలనుకున్నారు. తాను ఎంచుకున్న రైడ్‌కు ముందస్తు ఛార్జీలు రూ.359గా చూపించింది. వెంటనే రైడ్ కన్ఫర్మ్ చేశారు. అయితే రైడ్ ముగిసి క్యాబ్ దిగేప్పుడు ముందస్తు ఛార్జీలతో పోలిస్తే అదనంగా రూ.1,334 రైడ్ ఛార్జీలు చూపించాయి. దాంతో చేసేదేమిలేక ఆ మొత్తాన్ని చెల్లించారు.
తర్వాత అశ్వనీ ప్రశార్ కస్టమర్ చాట్, ఈమెయిల్‌ల ద్వారా కంపెనీకి సమస్యను వివరించారు. ఎంత ప్రయత్నించినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. దాంతో పూర్తివివరాలతో కన్జూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించారు. సమగ్ర విచారణ జరిపించిన కోర్టు తాజాగా ఉబర్ కంపెనీ రూ.10,000 పరిహారంతో పాటు చట్టపరమైన ఖర్చుల కోసం అదనంగా మరో రూ.10,000లను ప్రయాణికుడికి చెల్లించాలంటూ తీర్పు చెప్పింది.
ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా..
విచారణ సమయంలో ఉబర్ ఇండియా ఛార్జీల పెంపును సమర్థించింది. అందుకు అనేక రూట్ డివియేషన్స్ కారణమని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తు ఛార్జీలు, వాస్తవ ఛార్జీల మధ్య భారీ వ్యత్యాసం అన్యాయమని ఫోరమ్ తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment