సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు కోర్టు నుంచి సమాచారాన్ని దాచిపెట్టినందుకు దోషిగా తేలడంతో సుప్రీం తాజా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలకు భిన్నంగా 40 మిలియన్ డాలర్లను కుటుంబానికి బదిలీ నేరం కింద మాల్యాకు "ఈ శిక్ష తప్పదు. మాల్యా ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు" అని సుప్రీం పేర్కొంది. జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని, లేని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ఈ మొత్తాన్ని 8 శాతం వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ అధికారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోతే మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశంపై 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా పిటిషన్‌ను 2020లో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే.
కాగా 9వేల కోట్లకు పైగా రుణాన్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాపై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం కేంద్రం దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాస్తవాలను దాచిపెట్టి, డియాజియో నిధులను తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు డబ్బును మళ్లించారని, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను 'ద్వేషపూరితంగా ఉల్లంఘించారని' బ్యాంకులు ఆరోపించాయి. 2016 మార్చిలో యూకేకు పారిపోయిన మాల్యాను ఏప్రిల్ 18, 2017న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment