టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా పంట పండింది. తక్కువ లాభాలు ఉన్నప్పటికీ, వొడాఫోన్ ఐడియా షేర్ ధరలు ఒక్క రోజులో అమాంతం పెరిగాయి. ఆల్ టైమ్ హైని తాకాయి.
గత కొన్ని నెలలుగా నీరసమైన లాభాలు ఉన్నప్పటికీ డిసెంబర్ 29న 2023 చివరి మార్కెట్ సెషన్‌లో వోడాఫోన్ ఐడియా షేర్ ధరలు ఏకంగా 20 శాతానికి పైగా ఎగిశాయి. సంవత్సర కాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
వొడాఫోన్ ఐడియా షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో 20 శాతానికి పైగా ఎగిసి రూ.13 నుంచి రూ.16కి చేరాయి. ఇది కంపెనీ 52 వారాల గరిష్టం. ఇక వొడాఫోన్ ఐడియా షేర్ ధరల 52 వారాల కనిష్టం విషయానికి వస్తే రూ. 5.70 వద్ద నమోదైంది.
ఆ డీలే కారణం!
16.05 కోట్ల షేర్లను విక్రయించి నిధులను సేకరించేందుకు వొడాఫోన్ ఐడియా ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే షేర్ల ధరలు అకస్మాత్తుగా పెరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం డీల్ లావాదేవీ విలువ రూ. 233 కోట్లు అని హిందీ వార్తా సంస్థ ఆజ్‌తక్ నివేదించింది. నిధుల సమీకరణ కోసం వొడాఫోన్ ఐడియా గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. అయితే కంపెనీ ఇంకా చాలా బ్యాంకులతో చర్చలు జరుపుతున్నందున పొడిగింపును కోరుతుందని భావిస్తున్నారు. అలాగే భారత్‌లో 5జీ రోల్ అవుట్ కోసం ప్రణాళికను రూపొందిస్తోంది.
2022లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు సంబంధించి వొడాఫోన్ ఐడియా ఈ సంవత్సరం ప్రారంభంలో టెలికమ్యూనికేషన్స్ విభాగానికి రూ.1700 కోట్లు చెల్లించింది. ఇది కంపెనీ షేర్‌హోల్డర్‌లలో నమ్మకాన్ని పెంచి, కంపెనీ షేర్ ధరను పెంచింది.
వాటాదారుల సొమ్ము రెట్టింపు
గత ఆరు నెలల్లో వొడాఫోన్ ఐడియా షేర్ ధరలు 113 శాతం పెరిగాయి. ఇన్వెస్టర్లు, వాటాదారుల డబ్బును రెట్టింపు చేసింది. 2007లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినప్పటి నుంచి వొడాఫోన్ ఐడియా షేర్లకు 2023 ఉత్తమ సంవత్సరం.
Comments
Please login to add a commentAdd a comment