నిఫ్టీ పదహారువేల మార్క్‌ దాటేనా? | This Week Market Trend Explained By Experts | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ నిర్ణయాలు, ఆర్థిక గణాంకాలే దిక్సూచి

Published Mon, Aug 2 2021 11:05 AM | Last Updated on Mon, Aug 2 2021 12:27 PM

This Week Market Trend Explained By Experts - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలే ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలు కూడా మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని అంటున్నారు.


పైన పేర్కొన్న అంశాలతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నప్పటికీ.., ప్రాథమిక మార్కెట్లో ఐపీఓలకు లభిస్తున్న అపూర్వ ఆదరణతో స్టాక్‌ మార్కెట్లో ఇప్పటికీ సానుకూల వాతావరణం కొనసాగుతోంది. ఈ వారంలోనూ సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్‌ అవ్వొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని ఎదుర్కొవల్సి వస్తుంది. దిగువస్థాయిలో 15,600 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నిరాళీ షా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో దేశీయ మార్కెట్‌ రెండోవారమూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆటో, బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లలో విక్రయాలు తలెత్తడంతో గతవారంలో సెన్సెక్స్‌ 388 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్లను నష్టపోయాయి. 


అందరి చూపు ఆర్‌బీఐ వైపు... 
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం(ఆగస్ట్‌ 4న) ప్రారంభం కానుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను ఆగస్ట్‌ ఆరున ఆర్‌బీఐ ఛైర్మన్‌ శక్తికాంత్‌దాస్‌ వెల్లడించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చని ఆర్థివేత్తలు భావిస్తున్నారు. అయితే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ అంశాలపై ఆర్‌బీఐ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. 

స్థూల ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాలు... 
ఆటో కంపెనీలు జూలై వాహన విక్రయ గణాంకాల విడుదలను ఆగస్ట్‌ ఒకటి నుంచి వెల్లడించడం షురూ చేశాయి. పలు కంపెనీలు వాహన ధరల్ని పెంచిన నేపథ్యంలో వాహన అమ్మకాలపై ధరల పెంపు ప్రభావం ఉండొచ్చు. కావున ఈ రంగ స్టాకులు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవ్వొచ్చు. ఇక ఆగస్ట్‌ రెండో తేదిన (సోమవారం) జూలై నెలకు సంబంధించిన మార్కిట్‌ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, జూన్‌ మాసపు తయారీ రంగపు డాటా 4వ తేదిన(బుధవారం) వెల్లడికానున్నాయి. 

కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు...
దేశీయ కార్పొరేట్‌ క్యూ1 ఆర్థిక ఫలితాల ఘట్టం కీలక దశకు చేరుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అవంతీ ఫీడ్స్, అల్కేమ్‌ అమైన్స్, బీఈఎల్, భారతీ ఎయిర్‌టెల్, బీపీసీఎల్, సిప్లా, డాబర్, ఇమామీ, ఎస్కార్ట్స్, గెయిల్, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, వోడాఫోన్‌ ఐడియా, నాల్కో, ఇన్ఫోఎడ్జ్, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, టాటా కన్జూమర్, దివీస్‌ ల్యాబ్‌ వంటి ప్రధాన కంపెనీలు వాటి జూన్‌ త్రైమాసిక ఆర్థిక గణాంకాలను వెల్లడించనున్నాయి.ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. 

నాలుగు ఐపీఓలు... 
ప్రాథమిక మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో ఒకేరోజు నాలుగు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. దేవయాని ఇంటర్నేషనల్, విండ్లాస్‌ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణా డయాగ్నటిక్స్‌ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్‌ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.3,614 కోట్లను సమీకరించనునున్నాయి. ఈ ఐపీఓలు ఆగస్ట్‌ నాలుగవ తేదీ (బుధవారం)న ప్రారంభమై.., ఎనిమిదో తేది (శుక్రవారం) ముగియనున్నాయి. 

ఆగస్ట్‌ 6న గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్స్‌ లిస్టింగ్‌... 
హెల్త్‌కేర్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్స్‌ షేర్లు శుక్రవారం(ఆగస్ట్‌ 6న) ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఐపీఓను ఈ జూలై 27– 29 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 695–720 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,514 కోట్లు సమకూర్చుకుంది. ఐపీఓ చివరి రోజు నాటికి 44.17 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఇష్యూ ధర రూ.720తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.130–150 మధ్య ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్‌ రోజు లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. 

నాలుగో నెలలో అమ్మకాలే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) నికర అమ్మకందారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి ఎఫ్‌ఐఐలు ఈ జూలైలో రూ.23,193 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గతేడాది మార్చి నెల తర్వాత ఎఫ్‌ఐఐలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలకు పాల్పడటం ఇదే తొలిసారి. గతవారంలో ఏకంగా రూ.10,288 విలువైన షేర్లను అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు ధీటుగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడుతూ సూచీలకు భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. ఈ నెలలో డీఐఐ రూ.18,394 కోట్ల షేర్లను కొన్నారు. గత ఒక్క వారంలోనే రూ.8,206 కోట్ల షేర్లను కొన్నారు  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement