కష్టపడి చదివి ఒక ఉన్నతమైన ఉద్యోగం చేయాలన్నది చాలామంది కల. ఐఏఎస్ చదవాలనుకున్న వారు దాన్ని సాధించి అక్కడితో ఆగిపోతారు. ఒక డాక్టర్ కావాలనుకున్న వారు డాక్టర్ అయితే చాలని అనుకుంటారు. అయితే ఈ కథనంలో మనం చెప్పుకోబోయే వ్యక్తి ఐఏఎస్‌తోనో.. డాక్టర్‌తోనో ఆగిపోలేదు. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతడు ఏమి సాధించాడు. ఎలా సాధించాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తొలి ప్రయత్నంలోనే..
మనం చెప్పుకోబోయే వ్యక్తి జైపూర్ ప్రాంతానికి చెందిన 'రోమన్ సైనీ' (Roman Saini). నిజానికి ఇతని కుటుంబంలో 12 మంది డాక్టర్లు ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని చిన్నప్పటి నుంచే తానూ డాక్టర్ అవ్వాలని భారతదేశంలో అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మొదటి ప్రయత్నంలోనే అర్హత సాధించించాడు. అప్పటికి అతని వయసు కేవలం 16 సంవత్సరాలు కావడం గమనార్హం. దీంతో భారతదేశంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణుడైన అతి చిన్న వయస్కుడిగా రికార్డ్ సాధించాడు.
ఐఏఎస్..
అయితే సమాజ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఐఏఎస్ చదవాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యంగా ఇందులోనూ మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించేశాడు. యుపిఎస్‌సిలో శిక్షణ పూర్తయిన తరువాత మధ్యప్రదేశ్ క్యాడర్‌లో జబల్‌పూర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. విధి నిర్వహణలో భాగంగానే ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ.. సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా యువత ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసాడు.
మధ్యప్రదేశ్ ప్రాంతంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఎందుకంటే అక్కడి వారికి ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన తక్కువ, అంతే కాకుండా వారికి సరైన మార్గ నిర్దేశం చేసేవారు లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా భావించాడు. కోచింగ్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న చాలా మందిని చూసి చలించి పోయాడు.
అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా..
మధ్యప్రదేశ్ ప్రాంతంలోని యువతను చూసి చలించిపోయిన రోమన్ సైనీ మెరుగైన విద్య అందించాలని, ఉద్యోగావకాశాల కోసం సరైన మార్గ నిర్దేశం చేయాలనీ భావించి తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. యువతను సరైన మార్గంలో పయనించేలా చేయడానికి ఆన్‌లైన్ కోచింగ్ సరైన మార్గం అని భావించి.. తన స్నేహితులు గౌరవ్ ముంజల్, హేమేష్ సింగ్‌తో కలిసి 'అన్‌అకాడమీ' (Unacademy) పేరుతో ఆన్‌లైన్ ట్యుటోరియల్ ప్రారంభించాడు.
అన్‌అకాడమీ ప్రారంభం..
సైనీ ప్రారంభించిన ఈ అన్‌అకాడమీ ప్రచారానికి యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను ఉపయోగించుకున్నాడు. ఇందులో సివిల్స్, స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC), ఐబీపీఎస్ (IBPS) ఉద్యోగ నియామకాలకు కావాల్సిన అన్ని మెటీరియల్స్, టీచింగ్ వంటివి మొత్తం అందించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ అకాడమీ ద్వారా సుమారు మూడు లక్షల మందికి పైగా కోచింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం అన్‌అకాడమీ అనేది 20 వేల మందికి పైగా బోధనా సిబ్బందిని కలిగి ఉంది. తక్కువ ఖర్చుతో అనుకున్నది సాధించాలనుకునే వారికి ఈ అకాడమీ ఒక వరం అనే చెప్పాలి.
(ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..)
అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి యువతకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్న రోమన్ సైనికి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఫిదా అయిపోయారు. ఈ అకాడమీ ద్వారా గొప్ప స్థాయికి చేరుకున్న వారు కూడా స్వచ్చందంగా సేవలందిస్తున్నారు. రోమన్ సైనీ ఒక గిటార్ ప్లేయర్ కూడా. ఇతడు పాటలు కూడా పాడతాడు.
(ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!)
నిజానికి రోమన్ సైనీ అనుకుని ఉండే ఇంకా గొప్ప స్థాయికి చేరుకుని ఉండేవాడు. కానీ సమాజం బాగుండాలంటే ఒక వ్యక్తి మాత్రమే అభివృద్ధి చెందితే సరిపోదు.. తన చుట్టూ ఉన్నవారు కూడా తప్పకుండా ఎదగాలి అనే ఆలోచనతో ఐఏఎస్ సైతం వదులుకున్నాడంటే అతని సేవాదృక్పధం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఈ రోజు అన్‌అకాడమీ అనేది రూ. 2,600 కోట్ల సంస్థగా అవతరించింది. ఈ ఘనత మొత్తం మాజీ ఐఏఎస్ అధికారి రోమన్ సైనీకే చెందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment