మెటా యాజమాన్యంలోని వాట్సాప్ భారతదేశంలో తన కార్యాలపాలను నిలిపి వేస్తుందా? అని కాంగ్రెస్ సభ్యుడు 'వివేక్ తంఖా' అడిగిన ప్రశ్నకు.. సమాచార, ప్రసార శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' సమాధానమిచ్చారు.
వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా దేశంలో తమ సేవలను మూసివేసే యోచనల గురించి భారత ప్రభుత్వానికి తెలియజేయలేదని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వినియోగదారుల వివరాలను పంచుకోవాలనే ప్రభుత్వ ఆదేశాల కారణంగా వాట్సాప్ భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేయాలని యోచిస్తోందా అనే ప్రశ్నకు వివరణాత్మక సమాధానం ఇచ్చారు.
ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ తన సేవలను భారతదేశంలో నిలిపివేయనున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వం చెప్పినట్లు ఎన్‌క్రిప్షన్‌ను ఉల్లంఘిస్తే యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని, ఇది యాప్ మీద ప్రజలకున్న నమ్మకం పోతుందని వాట్సాప్ తరపు న్యాయవాది తేజస్ కరియా కోర్టుకు తెలిపారు.
కొత్త నియమాలు గోప్యతకు భంగం కలిగిస్తాయని ఇప్పటికే వాట్సాప్, మెటా సంస్థలు పలుమార్లు ఆరోపించాయి. ఫిబ్రవరి 2021లో ప్రవేశపెట్టిన ఈ నియమాలు మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌ను కలిగి ఉంటాయి. హానికరమైన కంటెంట్‌ను ఎదుర్కోవడానికి ఈ నియమాలు అవసరమైనవని పేర్కొంటూ భారత ప్రభుత్వం ఈ నిబంధనలను సమర్థిస్తుంది.
వాట్సాప్ భారతదేశాన్ని విడిచిపెట్టినట్లయితే అది కంపెనీని.. దాని 400 మిలియన్ల మంది వినియోగదారులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో చాలా మంది వ్యక్తులు మరియు వ్యాపారాలు కమ్యూనికేషన్ కోసం వాట్సాప్‌పై ఆధారపడి ఉన్నాయి. వాట్సాప్ ఇండియాను వీడితే ఇలాంటి కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించవచ్చు.. ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవచ్చని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment