సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి ఒక్కరినీ తన కోసం వాడుకుని వదిలేసే రకం అని మరోసారి రుజువు చేసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో మొదటి నుంచి చంద్రబాబు గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తున్న నాయకులను పక్కనబెట్టి.. ఇతర జిల్లా నివాసి, ప్రస్తుత ఎమ్మెల్సీకి కుప్పం బాధ్యతలు అప్పగించనున్నారు. ఎమ్మెల్సీ చెప్పినట్లు ప్రతిఒక్కరూ వినాలని చెప్పి ఒప్పించేందుకు చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తున్నారు.
అందులో భాగంగానే మూడు రోజుల పర్యటనలో కేవలం ఒకే ఒక బహిరంగ సభ మాత్రం ఏర్పాటు చేసి.. మిగిలిన సమయం అంతా గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులతో విడివిడిగా సమావేశం కానున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులంతా చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఓటమిపాలైన తర్వాత 1989లో కుప్పంకు వలస వెళ్లారు. అప్పటి నుంచి మొన్నటి వరకు ఎన్నికల నామినేషన్‌కు వచ్చినా.. రాకపోయినా, ప్రచారం చేసినా.. చేయకపోయినా కుప్పంకు చెందిన నాయకులే అహర్నిశలు కష్టపడి గెలిపించారు.
ఆ ఓటమిని స్థానిక నేతలపై రుద్దే ఉద్దేశం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలకు జనం ఆకర్షితులయ్యారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా చేయలేని పనులు ఈ నాలుగేళ్లలో చేసి చూపించారు. దీంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలు నమ్మకం పెంచుకున్నారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించారు. చంద్రబాబుని నమ్మని కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఈ ఘోర పరిణామాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు స్థానిక సంస్థల ఓటమిని కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలపై మోపి చేతులు దులుపుకున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై న కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం నియోజకవర్గ పూర్తి బాధ్యతలు అప్పగించారు. స్థానిక నాయకులందరినీ కరివేపాకులా తీసిపడేశారు.
చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపట్ల అసంతృప్తిగా ఉన్న కుప్పం టీడీపీ నేతలను నయానో, భయానో ఒప్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బుధ, గుర, శుక్రవారాల్లో కుప్పంలోనే మకాం వేయనున్నారు. ఈ మూడు రోజుల్లో గురవారం మాత్రమే బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన సమయం అంతా కుప్పంలోని బీసీఎన్ కల్యాణ మండంలో నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం ముఖ్యఉద్దేశ్యం.. కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులంతా ఎమ్మెల్సీ చెప్పినట్లు నడుచుకోవాలని చంద్రబాబు హుకుం జారీచేయడమేనని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. బాబు నిర్ణయం పట్ల కుప్పం టీడీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కుప్పం నుంచే ఎన్నికలకు పిలుపునిస్తారా?
మరో వైపు 2024 ఎన్నికలకు చంద్రబాబు కుప్పం నుంచే పిలుపు ఇవ్వనున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత విద్యుత్ హామీని కుప్పంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అదే తరహాలో చంద్రబాబు కుప్పంలో కొత్తగా హామీలను ప్రకటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా.. రాష్ట్రస్థాయి నాయకులను కుప్పానికి రమ్మని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వారందరి సమక్షంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.
నమ్మించడానికి రెడీ!
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి భారీ చేరికలు ఉంటాయని జోరుగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని టీడీపీ శ్రేణులను నమ్మించారు. అందుకు అనుగుణంగా సాధారణ జనాన్ని పిలిపించుకుని టీడీపీ కండువాలు వేసి వారంతా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అని ఎల్లోమీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో వైపు వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు సృష్టించి, ఆపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లేందుకు కుట్రలు పన్నినట్లు టీడీపీ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment