35 ఏళ్లుగా మాటలతోనే చంద్రబాబు గారడీలు
కేవలం నకిలీ ఓట్లతోనే కుప్పంలో వరుస విజయాలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాస్తవాలు గ్రహించిన ప్రజలు
స్థానిక ఎన్నికల్లో ఘోరంగా తిరస్కరించిన ఓటర్లు
సార్వత్రిక సమరంలోనూ ఇదే పునరావృతమవుతుందనే భయంలో తమ్ముళ్లు
కుప్పం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి కొనసాగిన చంద్రబాబు ఆధిపత్యం అంత్యదశకు చేరిందా..? బురిడీ మాటలకు కాలం చెల్లిందా..? దశాబ్దాలుగా మోసిన ప్రజలకు టీడీపీ అధినేత అసలు తత్వం బోధపడిందా..? వాస్తవాలు గ్రహించిన జనంలో మార్పు మొదలైందా..? ఇన్నేళ్లుగా నల్లేరుపై నడకలా సాగిన చంద్రబాబు గెలుపు ఇకపై కష్టంగా మారబోతోందా..? కుప్పంలో మారిన లెక్కలను గమనిస్తే అసలు నిజం అర్థమవుతోంది. స్థానిక.. పురపాలక ఎన్నికల్లో వచ్చిన ఫలితమే మార్పునకు దర్పణం పడుతోంది. అందుకే టీడీపీ అధినేత వరుస పర్యటనలకు వస్తున్నట్లు ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది.
సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గ ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం వాసులు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం. నేటి పాలనకు.. నాటి టీడీపీ పాలనను బేరీజు వేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో డీబీటీ ద్వారా 4,32,067 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,244.23 కోట్లు నేరుగా జమ చేసింది. నాన్ డీబీటీ ద్వారా 3,03,080 మంది లబ్ధిదారులకు రూ.1,175.21 కోట్లు అందించింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా, ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా చెప్పుకోదగ్గ ఒక్క మంచి పథకం తీసుకురాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. 35 ఏళ్లుగా కుప్పానికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పుకుంటూ వచ్చారే తప్ప మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. సీఎం వైఎస్ జగన్ ఐదేళ్లలోనే కుప్పానికి కృష్ణా జలాలను తీసుకువచ్చి స్థానికుల మనన్ననలు పొందుతున్నారు.
ఇన్నేళ్లు గెలిపించింది దొంగ ఓట్లే
చంద్రబాబు 1989 నుంచి కుప్పం నుంచి పోటీ చేసి గెలుపొందుతూ వచ్చారు. ఈయన గెలుపునకు కుప్పం వాసుల అమాయకత్వమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుకు చెందినవారిని వేల సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయించడమే బాబు విజయానికి ప్రధాన కారణంగా ఆరోపిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా చంద్రబాబుపై పోటీకి దింపారు. ఎన్నికల సమయంలో కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా వచ్చి ఓట్లు వేసి వెళ్లడం గమనించిన చంద్రమౌళి దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయా ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు పోలైనట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో 18 వేల ఓట్లు ఒకసారి, 34 వేల ఓట్లు మరోసారి తొలగించారు.
కుప్పం నియోజకవర్గ సమాచారం
- 2019 ఎన్నికల్లో మొత్తం ఓట్లు 2,13,145
- టీడీపీకి పోలైనవి 1,00,164
- వైఎస్సార్‌సీపీకి వచ్చినవి 69,426
- స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఓట్లు 1,78,948
- టీడీపీ 21,038
- వైఎస్సార్‌సీపీ 79,633
- కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 38,213
- టీడీపీ 12,377
- వైఎస్సార్‌సీపీ 15,696
- ప్రస్తుతం ప్రచురితమైన తుది ఓటరు జాబితా ప్రకారం నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,23,174
రావడానికి ఓ లెక్కుంది?
కుప్పంలో 2014 ముందు ఒక లెక్క ఆ తర్వాత మరో లెక్క అన్న చందంగా మారింది. అప్పటి వరకు అన్ని గ్రామాలు చంద్రబాబు చెప్పిందే వేదంలా.. వేరొకరికి స్థానం లేకుండా భయపెడుతూ.. బెదిరిస్తూ ప్రత్యర్థి లేకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. 35 ఏళ్ల పాటు కుప్పం వాసులను ఆడిస్తూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత వరుస షాక్‌లు తగలడం మొదలైంది. ప్రతి గ్రామంలో టీడీపీకి పోటీగా వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసేవారు ముందుకు వచ్చారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ అందరూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే విజయం సాధించడంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో 35 ఏళ్లుగా కుప్పంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచనే చేయని చంద్రబాబుకు అప్పటికి జ్ఞానోదయమైంది. దీంతో హుటాహుటి ఇంటి నిర్మాణం చేపట్టారు. అలాగే తరచూ కుప్పానికి వస్తున్నారు. 2014–19 మధ్య కాలంలో సీఎం హోదాలో చంద్రబాబు 8 పర్యాయాలు మాత్రమే కుప్పంలో పర్యటించారు. 2019–2024 మధ్య కాలం 13 పర్యాయాలు కుప్పం వచ్చి కనీసం అంటే రెండు, మూడు రోజులు ఉండి వెళ్తున్నారు. ఓటమి భయంతోనే కుప్పానికి పరుగులు పెడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment