● 250 మందికి ఉపాధి ● ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ కండెవాల్
పుంగనూరు : శ్రీకాళహస్తి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీలో ఉత్పత్తులు ప్రారంభించడం సంతోషంగా ఉందని, అందరి సహకారంతో పరిశ్రమను మరింత విస్తరించి అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ కండెవాల్ తెలిపారు. శనివారం నూతన కంపెనీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సురేష్ కండెవాల్‌తో పాటు సీనియర్ జీఎం దొరైరాజు, ప్లాంట్ ఇన్‌చార్జి సేనాపతి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కండెవాల్ మాట్లాడుతూ.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని పుంగనూరు మండలం, ఆరడిగుంటలో పరిశ్రమను ఏర్పాటు చేయడం అదృష్టమన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సహకారం అందించిన మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథుధున్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తూ , ఫ్యాక్టరీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ కంపెనీ భారతదేశంలో అయిదు ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి, డీఐ పైపుల పంపిణీలో భారతదేశంలో తొలి స్థానంలో నిలిపామన్నారు. శ్రీకాళహస్తి ఫ్యాక్టరీలో సుమారు 6 వేల మంది కార్మికులతో ఉత్పత్తులు ఎగుమతులు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉత్పత్తుల నైపుణ్యంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, విద్యారంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కండెవాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment