మావిడాకులు | - | Sakshi
Sakshi News home page

మావిడాకులు

Published Wed, Feb 19 2025 12:44 AM | Last Updated on Wed, Feb 19 2025 12:45 AM

మావిడ

మావిడాకులు

భార్య, భర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న గృహహింస విభాగం కౌన్సెలర్‌ సుగుణ, పీవీ రేఖ

పెళ్లంటే.. రెండు కుటుంబాలు , రెండు జీవితాలు ఒక్కటి కావడం.. మూడు ముళ్లు..ఏడడుగులు కలిసి.. కష్టం వచ్చినా..కన్నీళ్లొచ్చినా నిండు నూరేళ్లు దంపతులు చేయి విడవకుండా ఒకరిపై మరొకరు ప్రేమ, ఆప్యాయతలు , అనురాగంతో ఆనందంగా జీవితం గడపడం.. ఇది హిందూ సంప్రదాయంలోని గొప్పతనం. కానీ చిన్నవాటికే తగువు లాడుకోవడం, పట్టింపులు, పంతాలకు పోయి అందమైన జీవితాలను అంధకారం చేసుకుంటూ ఇరు కుటుంబాలకు మనోవేదన మిగులుస్తున్నారు. నేటితరం కొత్త పోకడలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఈ కోవలోనే ఇటీవల జిల్లాలో దంపతుల విడాకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

కార్వేటినగరం : జీవితాంతం కలసిమెలసి జీవిస్తామని అగ్ని సాక్షిగా ఒక్కటైన దంపతులు..పెళ్లిముచ్చట తీరకముందే గొడవలు పడుతున్నారు. ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా ఉండాల్సిన వారు అపొహాలు, అనుమానాలతో విడిపోతున్నారు. నీవే నాప్రాణం..నీవు లేకపోతే చచ్చిపోతానంటూ పెళ్లి అయిన తొలినాళ్లలో ఎంతో ప్రేమ చూపేవారు.. ఆ తర్వాత వాటన్నింటిని మరిచి.. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఛీదరించుకోవడం, కోపడ్డం.. చివరకు విడాకులు వరకు వెళుతున్నాయి.

భవిష్యత్తు అంధకారం..

చిన్న చిన్న విభేదాలు, వివాదాలతో కోర్టు మెట్లు ఎక్కుతుంటే.. మరి కొందరు కక్షల కార్పణ్యాలతో రగిలిపోతున్నారు. గృహహింస విభాగం సిబ్బంది, పోలీసుల కౌన్సెలింగ్‌తో కొందరు సర్దుకుపోతున్నారు. మరి కొందరు అ యితే మూర్ఖంగా వ్యవహరించి భవిష్యత్తును అంధకారం చేసుకోవడంతో పాటు వారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలను దూ రం చేస్తున్నారు. తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పెళ్లి అంటేనే ఆడ, మగపిల్లల తల్లిదండ్రులు ఆలోచనలో పడుతున్నారు.

కౌన్సెలింగ్‌ ఇచ్చినా..

వివిధ కారణాలతో విడిపోయేందుకు సిద్ధపడుతున్న దంపతులను కలపడానికి ఎన్ని కౌన్సెలింగ్‌లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛి న్నమై చిన్నకుటుంబాలు ఏర్పడడం వల్ల సంప్రదాయాలు, సత్సంబంధాలు గురించి తెలియడం లేదు. ఒకరి నిర్ణయాలకు మరొకరు గౌరవించకపోవడం, మొండి వైఖరితో భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని పోలీసులు, గృహ హింస కౌన్సెలింగ్‌ విభాగం సిబ్బంది చెబుతున్నారు.

ఎవరికి వారే మొండిపట్టు..

సంప్రదాయాలను గౌరవిస్తూ గతంలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. ఏమైనా సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇద్దరికీ సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్ధలను తొలగించేవారు.అప్పటికీమాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇచ్చి దంపతులను ఒక్కటి చేసేవారు. పస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పెద్దల మాటలను గౌరవించని , సమాజ విలువలు పాటించని, వివాహ బంధాలను లెక్కచేయని యువతీ, యువకులు వివాదాల్లో చిక్కుకుని, కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నారు.

వేరు కాపురాలపై ఆసక్తి..

ఉమ్మడి కుటుంబంలో కలసి జీవించేందుకు అధిక శాతం మంది యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్త, మామలు, ఆడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో తమ కుమార్తె హాయిగా జీవించగలదనే భరోసా కల్పించలేకపోతున్నారు. కారణం ఏదైనా చిన్న కుటుంబంగా జీవించడం అలవాటు పడుతున్న నేటి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలకు ససేమిరా అంటున్నారు. ఇది కూడా పండంటి కాపురాలకు అవరోధంగా మారింది.

పెళ్లి అయిన కొన్నిరోజులకే విడిపోతున్న జంటలు

మూడు ముళ్ల బంధం.. మూణ్నాళ్ల ముచ్చటే..!

కూలుతున్న పచ్చని కాపురాలు

బలహీన పడుతున్న వివాహ బంధం

గృహహింస విభాగాన్ని ఆశ్రయించిన 207 బాధితులు

రాజీ పడుతున్న జంటలు కొన్నే..

గొప్పలకు పోయి నాశనం చేసుకుంటున్నారు

ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది దంపతులు ఉన్నత చదువులు చదువుకున్న వారే. ఆర్భాటాలు, గొప్పలకుపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబ జీవితంపై అవగాహన ఉండాలి. ఉన్నంతలో సర్దుకుపోవడానికి ప్రయత్నించాలి. పిల్లలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి. కుటుంబ వ్యవస్థకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలి. వివిధ కారణాలతో గృహహింస విభాగాన్ని ఆశ్రయించే వారికి చెబుతున్నాం. సాధ్యమైనంత వరకు కలిపేందుకు ప్రయత్నిస్తున్నాం. అప్పటికీ రాజీ పడని వారికి కోర్టులో కేసు ఫైల్‌ చేస్తాం.

– డి.వెంకటేశ్వరి, గృహహింస విభాగం ప్రాజెక్టు డైరెక్టర్‌, చిత్తూరు

వివిధ కారణాలతో కోర్టుకు...

పెళ్లయిన కొద్ది రోజులకే భర్త పట్టించుకోకపోవడం లేదని, అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని మహిళలు గృహహింస విభాగాన్ని ఆశ్రయిస్తున్నారు. మరికొంత మంది పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెడుతున్నారు. మరికొందరు నేరుగా కోర్టులో కేసు పెడుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో 207 మంది గృహహింస విభాగాన్ని ఆశ్రయించారు. వీరిలో 145 మంది గృహహింస విభాగం సిబ్బంది ఇచ్చిన కౌన్సెలింగ్‌లో రాజీ పడ్డారు. 45 కేసులు కోర్టుకు ఫైల్‌ చేశారు. అందులో ఒక్కటి కోర్టు ఆర్డర్‌ అయింది.17 కేసులు కౌన్సెలింగ్‌ ప్రాసెస్‌లో ఉన్నాయి.

– సుగుణ, గృహహింస విభాగం సోషల్‌ అండ్‌ లీగల్‌ కౌన్సెలర్‌, చిత్తూరు

No comments yet. Be the first to comment!
Add a comment
మావిడాకులు1
1/2

మావిడాకులు

మావిడాకులు2
2/2

మావిడాకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement