డీకే ఆస్తులపై వివాదం
చిత్తూరు అర్బన్ : చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్, డీకే ఆదికేశవులు నాయుడుకు చెందిన ఆస్తులపై బెంగళూరులో వివాదం నెలకొంది. దీంతో ఆయన తనయుడు డీఏ శ్రీనివాస్‌కు, మరో వ్యక్తికి వాగ్వాదం చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన వీడియోలు కొన్ని వాట్సాప్‌లో శనివారం వైరల్‌గా మారాయి. ఆదికేశవులు నాయుడు, ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే సత్యప్రభకు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి. వీరిద్దరి మరణానంతరం పలు ఆస్తులు కుటుంబ సభ్యులు సామరస్యంగానే పంచుకున్నట్లు తెలిసింది. అయితే బెంగళూరు వైట్ ఫీల్డ్‌లో రూ.వందల కోట్ల విలువచేసే ఓ స్థలంపై శ్రీనివాస్‌కు, అక్కడున్న ఓ ప్రధాన వ్యక్తికి మధ్య వివాదం నెలకొంది. దీంతో కోర్టుకు ఆశ్రయించినట్లు సమాచారం. ఆస్తికి సంబంధించిన విషయం కోర్టులో ఉండగా, ప్రత్యర్థి ఖాళీ జాగాలో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు తెలుసుకుని శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. పనులు నిలుపుదల చేయాలని కోరినా, ప్రత్యర్థి పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికే బెంగళూరు పోలీసులు ఘటనా స్థలంలో ఉండటంతో శ్రీనివాస్‌ను బయటకు లాక్కెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ శ్రీనివాస్ నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై తన న్యాయవాదులతో మాట్లాడి, చట్టపరంగా ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించిన శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment