ఫోర్జరీ కేసు విచారణ తిరిగి ప్రారంభం
చిత్తూరు అర్బన్ : చిత్తూరు అర్బన్ తహసీల్దార్‌గా పనిచేసిన కళావతి సంతకం ఫోర్జరీ పై విచారణ మళ్లీ ప్రారంభమైంది. కదలని తహసీల్దార్ సంతకాల ఫోర్జరీ విషయంపై శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో పోలీసుల వెనుకడుగు అనే శీర్షకతో కథ థనం ప్రచురితమైంది. దీనిపై ఎస్పీ మణికంఠ ఆగ్రహానికి గురయ్యా రు. పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేయాలని తాలూకా ఎస్‌ఐ మల్లికార్జునకు ఆదేశించారు. మరుగునపడిన ఫోర్జరీ కేసులో కదలిక వచ్చింది. దీనిపై మళ్లీ విచారణను ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయానికి ఫోర్జరీ పత్రంలోని సర్వే నంబర్లు, వాటికి సంబంధించి రాత పూర్వకంగా వివరాలు అడిగారు. ఆ వివరాలను తహసీల్దార్ శనివారం సమర్పించారు. వారంరోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి కేసు వివరాలను పూర్తి స్థాయిలో ఎస్పీకి సమర్పించనున్నట్లు తెలిసింది.
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై దృష్టి
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై దృష్టి పెట్టామని డీపీఓ సుధాకర్‌రావ్ శనివారం తెలిపారు. వీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పలు వర్మికంపోస్టు కేంద్రాలను తనిఖీ చేశామని చెప్పారు. ఈఓపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశామన్నారు. క్లాప్‌మిత్రల పెండింగ్ వేతనాలు చెల్లింపు చేస్తున్నామని, అవసరమైన ప్రాంతాల్లో క్లాప్‌మిత్రలను నియమించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో సిబ్బంది రోజు ఉదయం చెత్తను సేకరించి వర్మికంపోస్టు యార్డులకు తరలించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే రైతులకు విక్రయిస్తామన్నారు. జిల్లాలోని 89 వర్మికంపోస్టు షెడ్‌లను రూ.1.65 కోట్లతో మరమ్మతు పనులు చేయిస్తున్నామని డీపీఓ వివరించారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలకు
15 కేంద్రాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డీఈఓ వరలక్ష్మి హెచ్చరించారు. శనివారం డీఈఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఛీప్ సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మార్చి 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల్లో ఎలాంటి మాస్ కాఫీయింగ్ జరగకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 3,419 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. అనంతరం చిత్తూరు ఎంఈవో– 2 మోహన్ చీఫ్‌సూపరింటెండెంట్‌లకు పరీక్షల నిర్వహణపై సూచనలు ఇచ్చారు. సమావేశంలో ఏడీ–2 వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
దళితులు రోడ్డుపై
వెళ్లకుండా ఆంక్షలు
పెనుమూరు(కార్వేటినగరం): అరివాండ్లవూరు దళితవాడ నుంచి గొల్లపల్లి వరకు అరకిలోమీటర్ దూరం వరకు మట్టి రోడ్డు ఉంది. శుక్రవారం రాత్రి ఓ సామాజిక వర్గం నేతలు .. దళితులు ఈ మార్గంలో వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తూ దళితవాడకు వెళ్లే రోడ్డును జేసీబీతో రాత్రికి రాత్రే తవ్వి దారి లేకుండా చేశారని కాలనీ వాసులు వాపోయారు. రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా వచ్చి కొన్నిఏళ్లుగా ఉన్న రోడ్డును నేడు పట్టా భూమిలో ఉందని చెప్పి చేతులు దులుపుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళితులు రోడ్డుపై వెళ్లకుండా అడ్డుకుంటున్న ఓ సామాజిక వర్గంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని దళితులకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment