
వరసిద్ధుని సేవలో రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ కృష్ణతేజ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామి దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈఓ పెంచల కిషోర్ శేష వస్త్రంతో సన్మానించి స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతి సాగర్‌రెడ్డి, ఏఈఓ రవీంద్రబాబు, డీపీఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
టీకాలలో
రొంపిచెర్ల మొదటి స్థానం
రొంపిచెర్ల : గాలి కుంటు వ్యాధి టీకాలు వేయడంలో రొంపిచెర్ల మండలం చిత్తూరు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. మండలంలో 7,854 పశువులకుగాను 5,701 పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలు, 520 దూడలకుగాను 367 దూడలకు బ్లూ సోసిస్ వ్యాధి టీకాలు, 5000 గొర్రెలు, మేకలకు మశూచి వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో చిత్తూరులో రొంపిచెర్ల మండలం మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 121 పశువులకు బీమా చేసి మొదటి స్థానంలో ఉన్నట్లు మండల పశు వైద్యాధికారి శ్రీధర్ తెలిపారు. మండలానికి పశు బీమా కోసం రూ.20 వేలు బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే పశు బీమా కోసం రూ.1,85,856 లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు. దీంతో మండలానికి అదనంగా రూ.1,65,856 లక్షలు మళ్లీ మంజూరు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 98.2 శాతం బడ్జెట్‌ను ఖర్చు చేసి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు.
గ్రేడ్–3 ఏఎన్‌ఎం
పదోన్నతుల్లో గోల్‌మాల్ ?
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉమ్మడి జిల్లాలో గ్రేడ్ –3 ఏఎన్‌ఎంల పదోన్నతుల్లో గోల్‌మాల్ చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల పాటు జీఎన్‌ఎం శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎన్‌ఎంలు ఇందుకు అర్హులు. అయితే గత 6 నెలలుగా ఈ పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో పదోన్నతుల కోసం కొంత మంది అడ్డదారులు తొక్కినట్లు విమర్శలు వస్తున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం తప్పుగా ఇచ్చినట్లు తెలిసింది. సిఫార్సులు, కాసులకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. రోస్టర్ పాయింట్లు మొత్తం గోల్ మాల్ జరిగిందని కొంత మంది ఏఎన్‌ఎంలు సోమవారం కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.
రెండు కిలోల
గంజాయి స్వాధీనం
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో ఓ ముఠా నుంచి రెండు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఇరువారం శివారులో గంజాయి విక్రయిస్తున్నట్లు టూటౌన్ సీఐ నెట్టికంటయ్యకు సమాచారం అందింది. దీంతో ఆయన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. అల్లాబతో పాటు మరికొందరు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ దాడుల్లో రెండు కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఓ ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment