‘ద్రవిడం’.. తిరోగమనం! | - | Sakshi
Sakshi News home page

‘ద్రవిడం’.. తిరోగమనం!

Published Wed, Apr 9 2025 12:40 AM | Last Updated on Wed, Apr 9 2025 12:40 AM

‘ద్రవిడం’.. తిరోగమనం!

‘ద్రవిడం’.. తిరోగమనం!

ద్రవిడ వర్సిటీకి అనుబంధ కష్టాలు పెరిగాయి. జిల్లాలోని కళాశాలలు వర్సిటీకి అనుబంధంగా చేయకపోవడంతో ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. కొన్ని కోర్సుల్లో విద్యార్థులు చేరక ఆ బ్రాంచ్‌లు మూతపడ్డాయి. కొత్త కోర్సులు లేకపోవడంతో విద్యార్థులు వర్సిటీలో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. న్యాక్‌ గ్రేడ్‌ లేకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. సొంత జిల్లా వాసి సీఎంగా ఎన్నికవడంతో వర్సిటీ అధికారులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు గడుస్తున్నా వర్సిటీ అభివృద్ధిపై పాలకులు నోరు మెదకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

కుప్పం : ద్రావిడ విశ్వవిద్యాలయం రోజు రోజుకు అభివృద్ధిలో తిరోగమన దిశగా పయనిస్తోంది. వర్సిటీలో అభివృద్ధి కంటే వివాదాలే ఎక్కువ నడుస్తున్నాయి. కనీసం వర్సిటీకి మెరుగైన న్యాక్‌ గ్రేడింగ్‌ రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ద్రవిడ వర్సిటీని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తామని ఎన్నికల హామీలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం నేటికీ వర్సిటీలో ఎలాంటి మార్పు తీసుకురాకపోగా కనీసం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏడాదికి పైగా జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దారుణమైన పరిస్థితులు దాపురించాయి. రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి తగినన్ని నిధులు ఇవ్వకపోగా కళాశాలల అనుబంధం అనుమతి దక్కలేదు. కొత్త కోర్సులు ప్రవేశ పెట్టకుండా ఉండడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

ఎటూ తేలకపోవడం

ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి వేరుగా విడిపోవడంతో చిత్తూరు జిల్లాలో ఏకై క వర్సిటీగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉంది. దీంతో జిల్లాలోని అన్ని కళాశాలలను ద్రవిడ వర్సిటీకి అనుబంధం చేస్తే రెవెన్యూ మెరుగై వర్సిటీ అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కళాశాలల అనుబంధం కార్యరూపం దాల్చలేదు. ఇందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి చిత్తూరు జిల్లాలుగా విడిపోయినా వీటికి సంబంధించిన బార్డర్లు తేలకపోవడంతో కళాశాలల అనుబంధం కష్టతరంగా మారింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కళాశాలలు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నడుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని కళాశాలలను ద్రవిడ వర్సిటీకి అనుబంధం చేస్తే ఎస్‌వీ వర్సిటీ రెవెన్యూకు గండికొట్టినట్లు అవుతుందని.. దీనిపై ఎస్‌వీ వర్సిటీ కోర్టును సైతం ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ద్రవిడ వర్సిటీకి ఇప్పట్లో చిత్తూరు జిల్లాలోని కళాశాలల అనుబంధం కష్టతరంగానే కనిపిస్తోంది.

ఉద్యోగుల కొనసాగింపుపై అనుమతి రాకపోవడం

ద్రావిడ వర్సిటీలో విధులు నిర్వహిస్తున్న 235 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో దాదాపు సగానికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వర్సిటీలోని ఉద్యోగులకు ఇప్పటికే 12 నెలలకు పైగా జీతాలు ఇవ్వక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వర్సిటీ అధికారులు 235 మందికి ఫైనాన్స్‌ అప్రూవల్‌ ఇవ్వాలని వినతి చేశారు. దీనిపై ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అంత మందికి అప్రూవల్‌ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్లు సమాచారం. వర్సిటీలోని విద్యార్థులు, శాఖలు వంటి ప్రామాణికతకు తగ్గట్టు ఎంత మేరకు అవసరమో తెలిపితే అంత మందికి మాత్రమే అప్రూవల్‌ ఇచ్చేందుకు సుముఖం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో వర్సిటీ అధికారులు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే వర్సిటీలో 235 మంది ఉద్యోగులు దాదాపు 15 సంవత్సరాలకు పైగా విధులు నిర్వహిస్తున్నవారే. ఇన్ని సంవత్సరాలు వర్సిటీలో విధులు నిర్వహిస్తూ.. వర్సిటీనే నమ్ముకుని తాము ఉద్యోగాలు చేస్తున్నామని, ఉద్యోగాలు కోల్పోతే తాము ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఉద్యోగిని తొలగించిన ఎంతటి పోరాటానికై నా సిద్ధమని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం

అభివృద్ధికి దూరంగా వర్సిటీ

జిల్లాలోని కళాశాలల అనుబంధం సాధ్యమేనా?

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం!

ఆసక్తి చూపని విద్యార్థులు

ద్రావిడ వర్సిటీలో ఏటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. వర్సిటీని పలు శాఖల్లో విద్యార్థులే లేకపోవడం గమనార్హం. దీంతో పాటు ద్రవిడ వర్సిటీలో చేరేందుకు విద్యార్థులు సుముఖత చూపడం లేదు. అదే విధంగా ఇక్కడ అధ్యాపకులు విద్యార్థులను ఆకర్షించడంలో విఫలమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement