
తిరుపతి–కాట్పాడి డబ్లింగ్‌కు ఆమోదం
ఈ రైళ్లు ఆపండి సారూ..
తిరుపతి–రామేశ్వరం, హౌరా–పాండిచ్చేరి, ఓకా–రామేశ్వరం, తిరుపతి–రామేశ్వరం, టాటా–యశ్వంత్‌పూర్ రైళ్లు చిత్తూరు మీదుగా వెళ్తున్నప్పటికీ ఇక్కడ స్టాపింగ్స్ లేవు. ఈ రైలులో ప్రయాణించాలంటే పాకాల లేదా తిరుపతికి వెళ్లి ఎక్కాల్సిందే. వేలూరు నుంచి చైన్నెకు వెళ్లే రైలును చిత్తూరు నుంచి ఎక్కే సౌకర్యం కల్పించాలనే జిల్లావాసులు ప్రధాన డిమాండ్ తీర్చాలని కోరుతున్నారు.
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా రైల్వే చరిత్రలో కీలక ఘట్టానికి అడుగు పడింది. ఎప్పటి నుంచో జిల్లావాసులు కోరుకుంటున్న తిరుపతి–కాట్పాడి డబ్లింగ్‌కు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తిరుపతి–కాట్పాడి మధ్య 104 కిలోమీటర్లు లైన్‌ను రూ.1332 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు.
తిరుపతి–కాట్పాడి మధ్య దాదాపు 10 స్టేషన్ల మీదుగా దాదాపు 400 గ్రామాల నుంచి నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో ఎక్కువగా గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, తిరుచానూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుమల, ఆలయాలకు వేల మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. లైన్ డబ్లింగ్ చేయడం వల్ల ప్రయాణ సమయం తగ్గి రైళ్ల రాకపోకలు పెరగనున్నాయి. సింగిల్ లైన్ కారణంగా రైళ్ల వెయిటింగ్‌తో ప్రయాణికులకు చిరాకు తప్పదు. అదే డబ్లింగ్‌తో వేచి ఉండే సమస్య తగ్గుతుంది.
పెరగనున్న రద్దీ
తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. చంద్రగిరి కోటకు వీక్షకులు పెరగనున్నారు. తిరుపతి మీదుగా చంద్రగిరి, ముంగిలిపట్టు, పానపాకం, పాకాల, పూతలపట్టు, చిత్తూరు, సిద్దంపల్లె, రామాపురం, బొమ్మసముద్రం స్టేషన్ల మీదుగా కాట్పాడికి రాకపోకలు సాగిస్తుంటారు. అదనపు లైన్‌తో ఆధ్యాత్మిక, వాణిజ్య రంగాలు అభివృద్ధి కానున్నాయి. ప్రస్తుతం తిరుపతి–కాట్పాడికి 3 ప్యాసింజర్ రైళ్లు ఉండగా అవి రోజు ఆరు ట్రిప్పులు ద్వారా సుమారు 5 వేల మంది ప్రయాణికులను చేరవేస్తోంది. వీటితో పాటు శేషాద్రి, కన్యాకుమారి, శబరి, కేరళ, ఎక్స్‌ప్రెస్‌లు ద్వారా బెంగళూరు–కాకినాడ, పూణే, హైదరాబాద్, కొచ్చిన్, త్రివేండం, న్యూఢిల్లీకి వేల మంది వెళ్తున్నారు. డబుల్‌లైన్ వేయడం ద్వారా మరిన్ని ఎక్స్‌ప్రెస్‌లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
104 కిలోమీటర్లు రూ.1332 కోట్లతో
నిర్మాణం
అభివృద్ధి కానున్న ఆధ్యాత్మిక, వాణిజ్య రంగాలు