
ఫోర్జరీ ముఠా కటకటాలపాలు
● కొలిక్కి వచ్చిన తహసీల్దార్ సంతకంఫోర్జరీ కేసు ● ఆరుగురు నిందితుల అరెస్టు ● నిందితుల్లో ఇద్దరు రెవెన్యూ సిబ్బంది.. నలుగురు పరారీ
చిత్తూరు అర్బన్ : తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠా ఎట్టకేలకు కటకటాలపాయ్యింది. చిత్తూరు తహసీల్దా ర్ కార్యాలయంలో వీఆర్‌ఏలుగా చలామణి అవుతున్న పెరుమాల్ మోహన్(45), ఎం.రాజశేఖర్(32), ఫైనా న్స్ కంపెనీలో పనిచేస్తున్న జి.గౌతం(24), కె.జాన్సి (28), డాక్యుమెంట్ రైటర్ కె.గజేంద్ర కుమార్(52) అనే అయిదుగురు నిందితులను బుధవారం తాలూక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి తహసీల్దార్, తహసీల్దార్ కార్యాలయ రాజముద్రలు, ఓ గ్రీన్ ఇంకు పెన్నును స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా కొందరు నకిలీ అధికారులు పలు రాజముద్రలు కలిగిన సీళ్లను ఉంచుకుని, తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారనే విషయంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ ఏడాది జనవరి 4వ తేదీన ‘ఆగని ఫోర్జరీ దందా’ శీర్షికన కథనం ప్రచురితమయ్యింది. దీంతో అప్పటి తహసీల్దార్ కళావతి తన సంతకాలు ఫోర్జరీ అయ్యాయని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు కేసును ముందుకు వెళ్లనీయకుండా మిన్నకుండిపోయారు. అయితే దీనిపై ఎస్పీ మణికంఠ సీరియస్‌గా తీసుకుని, కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని తాలూక ఎస్‌ఐ మల్లికార్జునను ఆదేశించారు. అనంతరం కేసు దర్యాప్తు పట్టాలెక్కింది. తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీచేసి, తిమ్మసముద్రం గ్రామంలోని భూమికి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఈ పత్రం ద్వారా ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో భారీగా రుణం తీసుకోవాలన్నది నిందితుల పథకం. వచ్చే రుణంలో 20 శాతం తమకు ఇవ్వాలని జాన్సి, గౌతం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో, ఇవి తప్పుడు ధ్రువీకరణ పత్రంగా సబ్–రిజిస్ట్రార్ గుర్తించారు. అనంతరం కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏలుగా చెలామణి అవుతున్న ఇద్దరితో పాటు ఓ డాక్యుమెంట్ రైటర్, ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో నలుగురు పరారీలో ఉన్నారు. వాళ్లను సైతం త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఫోర్జరీ కేసులో ఇద్దరు వీఆర్‌ఏల సస్పెన్షన్
గతంలో పనిచేసిన తహసీల్దార్ కళావతి సంతకం పోర్జరీ కేసులో ఇద్దరు వీఆర్‌ఏలపై కేసు నమోదైందని, వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వారు తండ్రి పేరుతో పనిచేస్తుంటే వాళ్ల తండ్రులను బాధ్యులు చేస్తూ..విధుల నుంచి తొలగిస్తామన్నారు. ఇకపై తండ్రి పేర్లతో పనిచేస్తామంటే కుదరదని, అలా ఆరు నెలల వరకే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఫోర్జరీ ముఠా కటకటాలపాలు