
కారును ఢీకొన్న కంటైనర్
బంగారుపాళెం: మండలంలోని మొగిలిఘాట్‌లో గురువారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై కారును కంటైనర్ ఢీకొంది. దొరచెరువు వద్ద బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న కారును వెనుక నుంచి కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు వెనుక భాగం దెబ్బతినింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిపై ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కబేళాలకు 30 పశువులు
● పట్టుకున్న పోలీసులు
పుంగనూరు: చట్టవిరుద్ధంగా కబేళాలకు తరలిస్తున్న 30 పశువులను పట్టుకుని, టీటీడీ గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద ఓ కంటైనర్‌లో పశువులను తరలిస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పశువులను స్థానిక మార్కెట్ యార్డుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, వాటిని టీటీడీ గోశాలకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కాశిరాలలో
జాతీయ బృందం పర్యటన
యాదమరి: జలజీవన్ పథకంలో చేసిన పనులను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి జాతీయ బృందం మండలంలో పర్యటించింది. గురువారం మండలంలోని కాశిరాల పంచాయతీలో జాతీయ బృందం సభ్యులు ఏడుగురు తాగునీటి ట్యాంకులు, నీటి కొళాయిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ బృందం సభ్యుడు అన్బజ్‌గన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ మంచి నీటిని అందించడమే జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. స్థానిక సచివాలయంలోని జల జీవన్ మిషన్‌కు సంబంధించి రికార్డులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటిపారుదల శాఖ డీఈలు శ్రీనివాసులు, రవికిరణ్, ఏఈ ఉషారాణి, ఈఓపీఆర్టీ సుకుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శిరీష పాల్గొన్నారు.