చిన్నపనైనా.. చేయి తడపాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

చిన్నపనైనా.. చేయి తడపాల్సిందే!

Published Sat, Apr 19 2025 9:22 AM | Last Updated on Sat, Apr 19 2025 9:22 AM

చిన్నపనైనా.. చేయి తడపాల్సిందే!

చిన్నపనైనా.. చేయి తడపాల్సిందే!

● అవినీతికి అడ్డాగా చిత్తూరు రెవెన్యూ కార్యాలయం ● నకిలీ పత్రాలకు కేంద్ర బిందువు ● గొలుసు పడితే కాసులు ● పట్టాలంటే పైసలతోనే పని ● ప్రతి పనికి బహిరంగంగా వసూలు

చిత్తూరు నగరంలోని ఓ గ్రామకంఠం భూమిలో పూర్వీకులు ఇల్లు కట్టుకున్నారు. వాటికి ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. కానీ వంశపారపర్యంగా వారు ఆ గ్రామ కంఠం భూమిలోనే నివాసం ఉంటున్నారు. ఉన్న పాత ఇల్లు కొట్టేసి..కొత్త ఇల్లు కట్టుకోవాలంటే పొజిషన్‌ అవసరం. కానీ రెవెన్యూ అధికారులు పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు.

చిత్తూరులోని మరో చోట గ్రామకంఠ భూమి ఖాళీగా ఉంది. ఆ భూమి తమ అనుభవంలోనే ఉందని ఇద్దరు వ్యక్తులు కార్యాలయానికి వచ్చారు. పక్కాగా పని చేసి పెట్టేవారిని పట్టుకున్నారు. ఇంకేముంది మూడు రోజుల్లో ముచ్చటగా చేతిలో పొజిషన్‌ పెట్టేశారు. తీరా వారు అడిగినంత ఇచ్చుకున్నట్లు సమాచారం.

చిత్తూరు నగరానికి చెందిన ఓ భూమి రకం తప్పుగా నమోదైంది. దాన్ని మార్చుకుని కన్వర్షన్‌ పెట్టుకునేందుకు భూ యజమాని ఆరునెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తొలుత భూమి సబ్‌ డివిజన్‌ కోసం ఓ సర్వేయర్‌కు రూ. 20 వేలు ఇచ్చుకున్నాడు. అయినా ఇంత వరకు పని కాలేదు.

చిత్తూరు మండలంలోని ఓ రైతు సర్వే చేసి హద్దులు చూపించుకునేందుకు ఓ సర్వేయర్‌కు రూ.60వేలు ఇచ్చుకున్నాడు. ఆ పనికాకపోవడంతో ఆ రైతు కొన్ని నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఆ సర్వేయర్‌ను అదనపు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి మార్చడంతో ఆ రైతు విస్తుపోతున్నాడు. ఇలా ఓ టీడీపీ కార్యకర్త కూడా రూ.10 వేలు ఇచ్చుకున్నా సర్వే కాలేదు. దీంతో అధికారంలో ఉండి కూడా ఏందీ తంటా అంటూ ఆ కార్యకర్త తల పట్టుకుంటున్నాడు. ఇలాంటి కేసులు ఇదొక్కటే కాదు..పదుల సంఖ్యలో వస్తున్నాయి.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు తహసీల్దార్‌ కార్యాలయం అవినీతికి అడ్డగా మారింది. నకిలీ పత్రాల తయారీకి కేంద్ర బిందువుగా పేరు తెచ్చుకుంది. ప్రతి పనికీ బహిరంగంగా కాసులు వసూలు చేస్తున్నారు. పట్టా ఇవ్వాలన్నా.. సర్వే చేయాలన్నా లంచాలు ఇవ్వాల్సివస్తోంది. చిత్తూరు నగరం మిట్టూరులో అర్బన్‌, వేలూరు రోడ్డులో రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాలున్నాయి. ఇక్కడకి నిత్యం 200 మందికిపైగా వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. సర్వే, పట్టాదారు పాసుపుస్తకం, మార్పులు, సర్వే నంబర్లల్లో తప్పులు తదితర సమస్యల పరిష్కారానికి వస్తుంటారు. వీరి అవసరాలను అసరా చేసుకుని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు.

దొంగ పట్టాలకు కేంద్ర బిందువు

చిత్తూరు అర్బన్‌ తహసీల్దార్‌ కేంద్రం దొంగ పట్టాలకు కేంద్ర బిందువుగా మారింది. తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు అధికారులు, సిబ్బంది, దళారులు కాసులు దండుకుంటున్నారు. ప్రశాంత్‌నగర్‌, తిమ్మసముద్రం, ఇరువారం, తదితర ప్రాంతాల్లో పట్టా ఉన్న స్థలాలకు మళ్లీ డూఫ్లికేట్‌ పట్టాలు సృష్టించి ఇచ్చేస్తున్నారు. ఇందులో ఇదివరకు పనిచేసిన తహసీల్దార్లు, విశ్రాంత తహసీల్దార్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వారు పనిచేసిన తేదీల్లో పట్టా ఇచ్చినట్లు పత్రాలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తప్పుడు పత్రాలు వేలల్లో ఉన్నట్లు అధికారుల అంచనా.

సర్వేకూ సమర్పించుకోవాల్సిందే!

ప్రస్తుతం సర్వేకు సంబంధించిన సమస్యలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీని ఆసరాగా చేసుకుని కొందరు సర్వేయర్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. సర్వేకు డబ్బులు..కట్టినా, కట్టపోయినా కాసులిస్తే వాలిపోతున్నారు. కొందరు నగదు రూపేణ తీసుకుంటే..మరికొందరు ఫోన్‌పే, జీ పే ద్వారానే కాసులు వసూలు చేసుకుంటున్నారు. ఇదంతా సాయంత్రం 6 గంటల తర్వాతే జరుగుతుంటాయి.

పనుల ఆధారంగా లంచం

రెవెన్యూలో ప్రతి పనికీ కొందరు అధికారులు నిర్భయంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పట్టామార్పునకు స్థలం, దాని విలువ ఆధారంగా వసూలు చేస్తున్నారు. సాధారణ ఫీజుగా రూ.20 వేలుగా ఫిక్స్‌ చేశారని విమర్శలు వస్తున్నాయి. సర్వే నంబర్లలో తప్పులు సరిదిద్దుకునేందుకు రూ.10 వేలు అడుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అన్‌లైన్‌లో దొర్లిన తప్పులు సరిదిద్దడానికి రూ.10వేలు, కరెంటు సర్వీసు రూ.10 వేలు, సబ్‌ డివిజిన్‌ చేసుకునేందుకు ఎంత డబ్బులిస్తే అంత తొందరగా పనులు అవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement