
పెనుమూరు..గంజాయి జోరు
● దాణా పేరుతో విచ్చలవిడిగా అమ్మకాలు ● చీకటి పడితే బీడు భూముల్లో ముఠాలు ● పక్క రాష్ట్రాల నుంచి యఽథేచ్ఛగా దిగుమతి ● నిద్ర మత్తులో అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : గంజాయి, మట్కా, గుట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పెనుమూరు మండల కేంద్రం నిలయంగా మారింది. మత్తుకు యువత బానిసలై తమ నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెనుమూరు మండల కేంద్రంలో కొన్ని నెలలుగా గంజాయి అమ్మకాలు జోరందుకున్నాయి. కొందరు దాణా వ్యాపారం పేరుతో గంజాయి అమ్మకాలు చేస్తూ చాపకింద నీరులా తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటున్నారు. అలాగే కొన్ని నిత్యావసర సరుకుల దుకాణాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పెనుమూరు మండల కేంద్రం చుట్టూ ఉన్న బీడు భూముల్లో చీకటి పడితే చాలు గంజాయి కేంద్రాలుగా మార్చేస్తున్నారు. మహిళలు బహిర్బూమికి వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాకు సమీపంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉండడంతో అక్రమ వ్యాపారులు కొందరు ప్రయాణికుల్లా ఎవరికీ అనుమానం లేకుండా చేతి సంచులు, కట్టె బ్యాగుల్లో రహస్యంగా ఆర్టీసీ బస్సుల్లో తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఎక్కువగా కర్ణాటక రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి మత్తుకు బానిసలైన యువత, విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దుకాణాల్లో తనిఖీలు లేకపోవడంతో అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అక్రమ వ్యాపారులు గంజాయితో రూ.లక్షలు గడిస్తూ పెనుమూరును గంజాయి వ్యాపారానికి కేంద్రంగా మారుస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తును వీడి గంజాయి అమ్మకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.