
రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీల విజేత విక్రాంత్‌రెడ్డి
రొంపిచెర్ల: రాష్ట్రస్థాయి దివ్యాంగుల రన్నింగ్ డేస్ పోటీల్లో రొంపిచెర్ల ఆదర్శ పాఠశాల దివ్యాంగ విద్యార్థి విక్రాంత్ రెడ్డి విజేతగా నిలిచాడు. చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రాతివారిపల్లెకు చెందిన విక్రాంత్ రెడ్డి రొంపిచెర్ల ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సోమవారం జరిగిన దివ్యాంగుల రాష్ట్రస్థాయి పరుగుపందెం పోటీల్లో విక్రాంత్ రెడ్డి విజేతగా నిలిచారని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సరళ, భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు అములు తెలిపారు. విన్నర్స్‌గా నిలిచిన విద్యార్థి విక్రాంత్ రెడ్డిని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంఈఓలు ఇందిర, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు అభినందించారు.
కక్ష కట్టి దాడులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం):కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షకట్టి దాడులకు పాల్పడుతున్నారని, దౌర్జన్యంగా పెద్దిరెడ్డి కుటుంబంపై తప్పడు కేసులు బనాయిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ ధ్వజమెత్తారు. చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్‌రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులపై ఎలాంటి ఆధారాలు లేవని, నియోజకవర్గంలో నిజాయితీగా అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. కూటమి ప్రభుత్వంవారిపై లేనిపోని నిందలు మోపడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకుని, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం పట్ల అధినేత జగన్‌మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.