మేఘా ఒలెక్ట్రా మెగా డీల్: మరో 350 ఎలక్ట్రిక్ బస్సులు | Olectra Greentech-Evey Trans to supply 350 e-buses to Pune | Sakshi
Sakshi News home page

మేఘా ఒలెక్ట్రా మెగా డీల్ : మరో 350 ఎలక్ట్రిక్ బస్సులు

Published Fri, Jan 29 2021 4:40 PM | Last Updated on Fri, Jan 29 2021 5:19 PM

Olectra Greentech-Evey Trans to supply 350 e-buses to Pune - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఎలక్ట్రిక్ బస్సుల (ఈవి) తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు గురువారం (28.01.2021) ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే దిశలో కేంద్ర ప్రభుత్వ ఫేమ్‌- 2 పథకంలో భాగంగా ఈ బస్సులను సరఫరా చేయనుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) / ఓపేక్స్ మాడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు ఈ 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టనుంది. ఈవీ ట్రాన్స్ ఈ 350 ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుండి సేకరించనుంది. ఈ 350 బస్సులను ఏడు నెలల్లో ఒలెక్ట్రా సంస్థ అందించనుంది. అందిస్తుంది. కాంట్రాక్ట్ కాలంలో ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా ఎవీ ట్రాన్స్ పరిధిలోనే ఉంటుంది. మొత్తంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ దాదాపు 1250 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్నది. 

బీఎంటీసీ బిడ్డింగ్ లో ఎల్-1 గా నిలిచిన ఒలెక్ట్రా
ఇక భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన గ్రీన్ సిటీ బెంగళూరులో సైతం 300 బస్సులను సరఫరా చేయడానికి పిలిచిన టెండర్లలో ఒలెక్ర్టా సంస్థ ఎల్-1 గా నిలిచింది. ఫేమ్-2 పథకంలో భాగంగా బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (బీఎంటీసీ) 300 విద్యుత్ బస్సులకు గాను నిర్వహించిన టెండర్ లో అతి తక్కువగా బిడ్డింగ్ కోట్ చేసి ఎల్-1 గా నిలిచింది. ఈ 300 ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ)/ఓపేక్స్ మాడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చేపడుతుంది. ఈవీ ట్రాన్స్ కి 300 బస్సుల సరఫరాకు అనుమతి లభించిన వెంటనే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి 12 నెలల కాలంలో సేకరిస్తుంది. 

పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ నుండి 350 ఎలెక్ట్రిక్ బస్సుల ఆర్డర్ దక్కించుకున్నందుకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) సీఈఓ అండ్‌ సీఎఫ్ఓ శరత్ చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ “ఇప్పటికే ఎవీ ట్రాన్స్ ఇప్పటికే పూణేలో 300 ఎలెక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని ఈ కొత్త బస్సుల రాకతో ఈ సంఖ్య 650 లకు చేరిందన్నారు. దేశంలోని ఒక రాష్ర్టంలో అత్యధికంగా బస్సులను సరఫరా చేసిన ఘనత ఒలెక్ర్టాకే చెందుతుందని తెలిపారు. 

ఒలెక్ర్టా ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ర్టాలలో ప్రయాణికులను గమ్యం చేరుస్తున్నాయి. దేశంలో మొట్టమొదటి సారిగా ఒలెక్ర్టా బస్సు 13,000 అడుగుల (3,962.4 మీ) ఎత్తు ఉన్న రోహ్తాంగ్ పాస్ వరకు ప్రయాణం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.

12 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 33 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్ ను కూడా ఏర్పాటు చేశారు. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ (Li-ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధునిక  సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్ ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 2 నుంచి 5 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement