ఏలూరు (టూటౌన్): డిపాజిటర్లకు రూ.3 కోట్లు ఎగవేసిన ఏలూరు ధన బ్యాంక్ కేసులో 21 మందికి పదేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ ఏలూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కోర్టు న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్ సోమవారం తీర్పునిచ్చారు. దీంతోపాటు ఒక్కొక్కరికీ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి డిపాజిటర్స్ యాక్ట్ కేసులో ముద్దాయిలకు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో 20 ఏళ్ల న్యాయపోరాటం ఫలించింది.
కేసు పూర్వాపరాలివీ..
జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ప్రత్యేక పీపీ లామ్ అజయ్ ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 2002లో ఏలూరు టూటౌన్ పరిధిలోని ధన బ్యాంక్ పలువురు డిపాజిటర్లకు రూ.3 కోట్లను చెల్లించకుండా మోసం చేసింది. అప్పట్లో ధన బ్యాంక్‌కు చెందిన మొత్తం 27 మందిపై ఎస్సై ఎం.సుధాకర్ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ బి.పెద్దయ్య ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. మొత్తం 27 మంది ముద్దాయిల్లో ఐదుగురు చనిపోగా.. ఒకరు పరారీలో ఉండటంతో మిగిలిన 21 మందికి న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు.
శిక్షపడిన వారిలో రావూరి సత్యసాగర్ (బ్యాంక్ చైర్మన్), తల్లాప్రగడ నాగేంద్రప్రసాద్, గోలి కృష్ణకుమారి, అమ్మనమంచి శివాజీ, రావిపాటి వీరవెంకట రామారావు, బాదంపూడి లక్ష్మీకుమారి, చింతా గిరి, కొవ్వూరి శ్రీనివాసరావు, ఇనుగంటి వెంకట సతీష్, బండారు నర్సింహమూర్తి, మామిడిబత్తుల నాగ శ్రీనివాస్, జక్కంపూడి శ్రీనివాస్, దాసరి బోసురాజు, గొల్ల భాస్కర సత్యనారాయణ ప్రసాద్, నక్కా శ్రీనివాసరావు, బోడ సాంబమూర్తి, రావూరి నాగ వెంకట సత్యనారాయణ, గుమ్మిడి వెంకట రమణమూర్తి, చెన్నకేశవులు రంగనాథ్, దుగ్గిరాల శేషసాయి సత్యశేఖర్, గద్దె ఉషారాణి ఉన్నారు. గుండాల గోపి అనే నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉండగా.. దుగ్గిరాల రవికుమార్, పయ్యావుల దామోదరరావు, బాలనాగు సోమేశ్వరగుప్త, దళపతి కోటమరాజు, గద్దె రుష్యేంద్ర నాగవెంకటప్రసాద్ మృతి చెందారు.
ధన బ్యాంక్ కేసులో 21 మందికి పదేళ్ల శిక్ష
Published Tue, Nov 22 2022 5:11 AM | Last Updated on Tue, Nov 22 2022 5:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment