సాక్షి, చెన్నై(తమిళనాడు): ఇటీవల కాలంలో మాజీ మంత్రుల ఆస్తులపై పంజా విసురుతూ వస్తున్న అవినీతి నిరోధకశాఖ మరోసారి జూలు విదిల్చింది. మాజీ మంత్రి సి.విజయభాస్కర్ ఆస్తులపై సోమవారం ఏకకాలంలో ఆరు జిల్లాల్లో (44 చోట్ల) మెరుపుదాడులు చేసింది. 2011–16, 2016–21 హయాంనాటి అన్నాడీఎంకే ప్రభుత్వంలోని మంత్రులు తమ పదవిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆరోపణలు చేయడంతోపాటూ విచారణకు ఆదేశించాల్సిందిగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం డీఎంకే అధికారం చేపట్టిన నేపథ్యంలో అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న మాజీ మంత్రుల ఆస్తులపై ఏసీబీ దాడులు చేస్తూ వస్తోంది. మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, ఎస్‌పీ వేలుమణి, కేసీ వీరమణి ఆస్తులపై ఏసీబీ వరుసగా దాడులు చేసి కేసులు పెట్టింది. ఇందుకు కొనసాగింపుగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఉన్న మాజీ మంత్రి సి. విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలు వంటి 44 చోట్ల సోమవారం ఉదయం మెరుపుదాడులు ప్రారంభించారు.
మాజీ మంత్రి సొంతూరైన పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలై సమీపం ఇలుపూరులోని ఇంటిలోకి సోమవారం ఉదయం 6 గంటలకు సుమారు సుమారు 50 మందికిపైగా ఏసీబీ అధికారులు ప్రవేశించి తనిఖీలు ప్రారంభించారు. ఆ తరువాత పలు బృందాలుగా విడిపోయి 6.30 గంటలకు ఏకకాలంలో పుదుక్కోట్టై జిల్లాలో 30 ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. విజయభాస్కర్ సోదరుల, స్నేహితుల ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలపై దాడులు జరిపారు. మదర్ థెరిసా విద్యా చారిటబుల్ ట్రస్ట్ పేరున స్థాపించిన 14 విద్యాసంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు.
కరోనా కాలంలో భారీగా అక్రమాలు
కరోనా కాలంలో వైద్య చికిత్సకు సంబంధించి మందులు, ఉపకరణాల కొనుగోలులో భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆదాయానికి మించి రూ.27.22 కోట్లు కూడబెట్టినట్లు, చెన్నైలో రూ.14 కోట్లతో లగ్జరీ నివాసం, విదేశీ మోడల్ కారు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో విజయభాస్కర్ భార్య రమ్య పేరును కూడా చేర్చారు. పుదుకోట్టైతో పాటూ చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చిరాపల్లి, కాంచీపురం, చెంగల్పట్టు..మొత్తం ఆరుజిల్లాల్లో జరిగిన తనిఖీల్లో సుమారు వందమందికి పైగా ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.
పీపీఈ దుస్తులతో తనిఖీలు
చెన్నై కీల్‌పాక్కంలోని విజయభాస్కర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో అతని భార్య రమ్య, పెద్ద కుమార్తె కరోనాకు గురై హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దాడుల్లో భాగంగా ఇంట్లోకి ప్రవేశించిన తరువాత ఏసీబీ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో పీపీఈ దుస్తులు, చేతికి గ్లౌజులు ధరించి భార్య, కుమార్తె ఉన్న గదితో సహా ఇల్లంతా తనిఖీలు సాగించారు. కాగా ఏసీబీ దాడులను నిరసిస్తూ అన్నాడీఎంకే శ్రేణులు మాజీ మంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కాగా ఈ సోదాల్లో రూ. 23 లక్షల నగదు, 4.87 కేజీల బంగారం, 136 భారీ వాహనాలకు సంబంధించి రికార్డులు బయటపడ్డాయి. అలాగే 19 హార్డ్ డిస్‌్కలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment