ఆస్పత్రిలో బాలుడికి చికిత్స చేస్తున్న వైద్యుడు
ఖమ్మం క్రైం: అసలే ఇరుకైన బ్రిడ్జి.. ఆపై రెండు బస్సులు పక్కనే వచ్చాయి.. ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వస్తున్న ఓ బాలుడు అవి తనపైకి వస్తాయేమోనని భయాందోళనతో కిందకు దూకాడు. ప్రాణాపాయం తప్పినా అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఖమ్మం రూరల్ మండలం కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన బీమనబోయిన ఈశ్వర్(14) నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
రోజులాగే మంగళవారం పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరిన ఈశ్వర్ మార్గమధ్యంలో మున్నేరు బ్రిడ్జి ఫుట్‌పాత్ మీదుగా నడుస్తున్నాడు. అదే సమయంలో ఓ బస్సును మరో బస్సు డ్రైవర్ ఓవర్‌టేక్ చేసే క్రమంలో అవి పక్కపక్కనే ఫుట్‌ఫాత్‌ను ఆనుకుంటూ వచ్చాయి. అప్పటికే ఈశ్వర్ బ్రిడ్జి రెయిలింగ్‌ను ఆనుకుని ఉండగా.. ఒక బస్సు డ్రైవర్ హారన్ కొట్టడంతో తనను ఢీకొడుతుందేమోననే భయంతో ఒక్కసారిగా బ్రిడ్జి పైనుంచి కింద ఉన్న నీళ్లల్లోకి దూకేశాడు.
బ్రిడ్జిపై నుంచి దూకిన బాలుడిని తెప్పపైకి చేర్చిన స్థానికులు.
అయితే, నీటిలో కొద్దిగా తేలిన బండపై పడటంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు, ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ బ్లూకోట్స్ కానిస్టేబుల్ అశోక్ ఇచ్చిన సమాచారం మేరకు ఈశ్వర్ తండ్రి శ్రీనివాసరావు, ఇతర కుటుంబసభ్యులు సంఘటనాస్థలానికి వచ్చారు. స్థానికుల సాయంతో బాలుడిని రోడ్డుపైకి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. కాగా, బాలుడు పైనుంచి కింద పడుతున్న సమయంలో వాహనదారులు, స్థానికులు హాహాకారాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment