8న అన్న పెళ్లి.. అంతలోనే విషాదం | Bridegroom Brother Dead In Road Accident At Vemulawada | Sakshi

8న అన్న పెళ్లి.. అంతలోనే విషాదం

Jan 7 2021 9:54 AM | Updated on Jan 7 2021 10:53 AM

Bridegroom Brother Dead In Road Accident At Vemulawada - Sakshi

కోనరావుపేట(వేములవాడ) : వారింట్లో మొదటి శుభకార్యం.. పెద్ద కుమారుడి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పచ్చని పందిరి వేసి, బంధుమిత్రులకు శుభలేఖలు పంచుతున్నారు. ఈ క్రమంలో వరుడి సోదరుడు బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి, సామగ్రి తీసుకురావడానికి తన మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లి దుర్మరణం  చెందాడు. ఈ ఘటన పెళ్లింట విషాదం నింపింది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన అవధూత వజ్రవ్వ–కాశయ్య దంపతులకు ప్రశాంత్, ప్రవీణ్‌ ఇద్దరు కుమారులు. వీరిలో ప్రశాంత్‌కు ఈ నెల 8న వివాహం నిశ్చయించారు. దీంతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రవీణ్‌(21) బంధువులందరినీ కలుస్తూ అన్న పెళ్లి పత్రికలు ఇస్తున్నాడు.

బుధవారం సిరిసిల్లలో బంధువులకు కార్డులిచ్చి, సామగ్రి తేవాల్సి ఉండటంతో తన మిత్రుడు తిరుమల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. నిజామాబాద్‌ శివారులోని చాంద్‌నగర్‌ సమీపంలో ట్రాక్టర్‌ను ఓవర్‌ టేక్‌ చేస్తుండగా ఎదురుగా టిప్పర్‌ వచ్చింది. దాన్ని తప్పించబోయి ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో బైక్‌ ట్రాక్టర్‌ ట్రాలీ కింది భాగంలోకి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనకాల కూర్చున్న తిరుమల్‌ ఎగిరిపడటంతో త లకు గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని ఎస్సై వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement