కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన కైరో నుండి 320 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఈజిప్టు అసియుట్ దక్షిణ ప్రావిన్స్‌లోని రహదారిపై చోటు చేసుకుంది.
అస్సియట్ గవర్నర్ ఎస్సామ్ సాద్ ప్రకటన ప్రకారం రాజధాని కైరో నుంచి అసియుట్‌కు వెళ్తున్న బస్సు, ట్రక్కును ఓవర్‌టేక్ చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. రెండు వాహనాలు దగ్ధం కావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ అధికారిక గణాంకాల ప్రకారం ఈజిప్టులో 2019 లో సుమారు 10,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇటీవలి సంవత్సరంలో 3,480 మందికి పైగా మరణించారు. 2018 లో 8,480 కారు ప్రమాదాలు జరగ్గా, 3,080 మందికి పైగా మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment