కరీంనగర్ క్రైం/చిగురు మామిడి: రోడ్డు పక్కనే ఉన్న ఓ వ్యవసాయ బావి మృత్యు బావిగా మారి ఓ కారును మింగేసింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ శివారులో జరిగింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న కారు గురువారం ఉదయం 11.00 సమయంలో అదుపుతప్పి రోడ్డుకు కుడివైపున ఉన్న బావిలో పడింది. వెనుకాలే కారులో వస్తున్న ఓ వ్యక్తి ఈ విషయం గమనించి కాపాడాలని ప్రయత్నించినా ఎవరూ లేకపోవడంతో కుదరలేదు.
దీంతో వెంటనే స్థానికులను పిలుచుకొచ్చాడు. సుమారు 30 నిమిషాల పాటు కారు నీటిపై తేలి ఆ తర్వాత మునిగిపోయింది. క రీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి, తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై మధుకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్లతో సహాయక చర్య లు చేపట్టగా, కారు ఆచూకీ లభించలేదు. గజ ఈతగాళ్లతో గాలించగా, ఫలితం లేకుండాపోయింది.
8 గంటలు శ్రమించి..
మొదట కారులో ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింజన్, రెండు క్రేన్ల ద్వారా కారును వెలికితీసేందుకు చేపట్టిన చర్యలు మొదట విఫలమయ్యాయి. రెండు, మూడు సార్లు క్రేన్‌కు చిక్కినా జారిపోయింది. రెండు మోటార్ల సాయంతో నీటిని తోడించినా ఫలితం దక్కలేదు. ఆఖరికి రాత్రి 8 గంటలకు పెద్ద క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు.
మృతుడు రిటైర్డ్ ఎస్సై..
కారును బయటికి తీశాక.. అందులో ఒక్కరి మృతదేహం లభించింది. మృతుడు కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో నివాసం ఉండే రిటైర్డ్ ఎస్సై అని పోలీసులు గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ తండాకు చెందిన రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్ (62)గా గుర్తించారు. గతంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఎస్సైగా విధులు నిర్వహించి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. పాపయ్యనాయక్‌కు భార్య భారతి, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
బుద్ధయ్య
నీ కోసమే డ్యూటీ చేసిన్నా అన్నా..
మానకొండూర్ డివిజన్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అందులో పాపయ్య నాయక్ సొంత తమ్ముడు బుద్ధయ్య నాయక్ కూడా ఉన్నాడు. బావిలో పడి చనిపోయింది తన అన్న అని తెలియకుండానే.. 9 గంటల పాటు సాయం అందించాడు. చివరకు మృతుడు తన అన్న తెలియడంతో ‘అన్నా ఇంతసేపు నీకోసమే డ్యూటీ చేసిన్నా.. బాయిల పడ్డది నువ్వేనా’అంటూ కన్నీరు మున్నీరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment