సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక డీజీపీ రాజేష్ దాసుతో పాటు చెంగల్పట్టు ఎస్పీ కన్నన్‌పై సీబీసీఐడీ గురిపెట్టింది. మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సోమవారం విచారణకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ కేసును మద్రాసు హైకోర్టు సైతం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. మహిళా ఐపీఎస్ అధికారికి లైంగిక వేదింపులు ఇచ్చినట్టుగా ప్రత్యేక డీజీపీ రాజేష్ దాస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును సీబీసీఐడీకి డిజీపీ త్రిపాఠి అప్పగించారు. లైంగిక వేధింపుల వ్యవహారం విల్లుపురం జిల్లా పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది.
దీంతో కేసు విచారణను విల్లుపురం సీబీసీఐడీ అడిషన్ డీఎస్పీ గోమతి నేతృత్వంలోని బృందానికి అప్పగించారు. అక్కడ విచారణ అనంతరం చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న సీబీసీఐడీ ఉన్నతాధికారులు సమగ్ర విచారణపై దృష్టి పెట్టబోతున్నారు. మూడు సెక్షన్ల కింద రాజేష్ దాసుపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చెంగల్పట్టు ఎస్పీ కన్నన్ కూడా బుక్కయ్యారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనివ్వకుండా ఎస్పీ కన్నన్ అడ్డుకున్నట్టు తేలింది. దీంతో ఆయనపై కూడా కేసు నమోదు కావడం గమనార్హం.
సుమోటో కేసు
సీబీసీఐడీ విచారణకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో లైంగిక వేధింపులపై మద్రాసు హైకోర్టు సైతం దృష్టి పెట్టింది. ఉదయం విచారణ సమయంలో న్యాయమూర్తి ఆనంద వెంకటేషన్ ఈ వ్యవహరాన్ని ప్రస్తావించారు. పోలీసు మహిళా ఉన్నతాధికారులకే భద్రత కరువై ఉండడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు వచ్చిన దృష్ట్యా, విచారణ న్యాయబద్ధంగా జరిగే రీతిలో కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
చదవండి: సీబీసీఐడీకి కీచక వ్యవహారం
Comments
Please login to add a commentAdd a comment