సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను రూ.61.71 కోట్ల మేర మోసంచేసిన కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కండ్ర ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ఇద్దరు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నెల్లూరులో ఆయన నివాసంతోపాటు మరో రెండుచోట్ల సీబీఐ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. కండ్ర ప్రసన్నకుమార్‌రెడ్డి శ్రీరాజరాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్ పేరిట తప్పుడు పత్రాలు సమర్పించి హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుంచి 2017, 2018ల్లో రూ.65.50 కోట్ల రుణం తీసుకున్నారు.
2018లో బ్యాంకు ఆ ఖాతాను నిరర్ధక ఆస్తి (ఎన్‌పీఏ)గా ప్రకటించింది. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి రూ.80 లక్షల రుణం చెల్లించారు. అప్పటికే ఆయన తన ఖాతాలోని నగదును నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఖాతాలకు తరలించినట్టు బ్యాంకు గుర్తించింది. వ్యాపార అవసరాల కోసం తీసుకున్న రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తప్పుడు టర్నోవర్ పత్రాలు చూపించి రుణం తీసుకున్నారని కూడా నిర్ధారణ అయింది. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీబీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
బ్యాంకును మోసగించారని సీబీఐ కేసు నమోదు
Published Fri, Apr 29 2022 4:24 AM | Last Updated on Fri, Apr 29 2022 4:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment