బెయిల్‌ కోసం బాబు అడ్డదారులు.. ‘నెవర్‌ బిఫోర్‌’  | Chandrababu Naidu Trying Hardly For Bail In Skill Scam Case, Launched His Trademark Astram 'Not Before' In The High Court - Sakshi
Sakshi News home page

Skill Development Scam Case: బెయిల్‌ కోసం బాబు అడ్డదారులు.. ‘నెవర్‌ బిఫోర్‌’ 

Published Sat, Oct 28 2023 3:10 AM | Last Updated on Sat, Oct 28 2023 8:34 AM

Chandrababu Naidu trying hardly for bail - Sakshi

సాక్షి, అమరావతి:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసి జైలుపాలైన చంద్రబాబు ఇప్పుడు దాని నుంచి ఎలాగైనా బయటపడాలని బెయిల్‌ కోసం అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకోసం గతం నుంచి తాను అనుసరిస్తున్న తన ట్రేడ్‌మార్క్‌ అస్త్రం ‘నాట్‌ బిఫోర్‌’ ను ఆయన మరోసారి బయటకు తీశారు. తమ పార్టీకి, తమ లీగల్‌ సెల్‌కు ఏ సంబంధం లేని జీవీఎల్‌ మూర్తి అనే న్యాయవాదిని తెరపైకి తెచ్చారు.

ఆయనతో తన తరఫున చంద్రబాబు కన్సెంట్‌ వకాలత్‌ (అప్పటికే దాఖలు చేసిన కేసులో వకాలత్‌ వేసిన న్యాయవాది అనుమతితో మరో న్యాయవాది కూడా వకాలత్‌ దాఖలు చేయడం) దాఖలు చేయించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది జి.బసవేశ్వరరావు వకాలత్‌ వేసి ఉండగానే.. మూర్తితో వకాలత్‌ దాఖలు చేయించడం గమనార్హం. సాధారణంగా ఇలా వకాలత్‌ దాఖలు చేసిన కేసులో ఏ మాత్రం సంబంధం లేని మరో న్యాయవాది వకాలత్‌ దాఖలు చేసేందుకు ఏ న్యాయవాది ఒప్పుకోడు.

కాగా చంద్రబాబు తర­ఫున వకాలత్‌లు దాఖలు చేసిన బసవేశ్వరరావు గా­నీ, మూర్తి గానీ వాదనలు వినిపించకపోవడం ఇందులో అసలు ట్విస్టు. శుక్రవారం జరిగిన విచారణకు మూర్తి రాలేదు కూడా. దీన్ని బట్టి చంద్రబాబు ఇక్కడ మూర్తిని ఓ నిర్దిష్ట ప్రయోజనం నిమిత్తం వాడుకోవాలని నిర్ణయించి, ఆయనతో వకాలత్‌ దాఖలు చేయించారని ఇట్టే అర్థమైపోతోంది. 

మూర్తి వెనుక ఉంది వారే..
జీవీఎల్‌ మూర్తితో వకాలత్‌ దాఖలు చేయించడం ద్వారా నిబంధనలకు అనుగుణంగా, ముక్కుసూటిగా నడుచుకుంటారనే పేరున్న న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ముందు తన బెయిల్‌ పిటిషన్‌ను రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. జస్టిస్‌ జ్యోతిర్మయి ముందు ఎవరు ‘నాట్‌ బిఫోర్‌’ న్యాయవాదులు ఉన్నారో ముందుగానే తెలుసుకుని, అందుకనుగుణంగా మూర్తితో వకాలత్‌ దాఖలు చేయించారు.

వాస్తవానికి ఈ మూర్తిది కూడా చంద్రబాబు సామాజికవర్గమే. పెద్దగా ప్రాక్టీస్‌ ఉన్న న్యాయవాది కాదు. చిన్న చిన్న కేసులు, ఉద్యోగ వివాదాలకు సంబంధించిన కేసులను వాదిస్తుంటారు. ఎప్పుడూ టీడీపీ కేసులను కూడా వాదించింది లేదు. కాగా ఎల్లో మీడియాకు చెందిన ఓ న్యూస్‌ చానెల్‌ యజమానికి మూర్తి అత్యంత సన్నిహితుడు. జస్టిస్‌ జ్యోతిర్మయి ముందు మొత్తం నలుగురు న్యాయవాదులు ‘నాట్‌ బిఫోర్‌’గా ఉన్నారు.

ఈ నలుగురిలో ముగ్గురు న్యాయవాదులు తమ ఉచ్చులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తమవాడే అయిన మూర్తిని చంద్రబాబు అండ్‌ కో విజయవంతంగా తమవైపు తిప్పుకుంది. ఎల్లో మీడియా న్యూస్‌ చానెల్‌ యజమాని, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి.. ఈ విషయంలో మూర్తిని ఒప్పించారు. అంతేకాకుండా చంద్రబాబు అండ్‌ కో ఆయనకు భారీ మొత్తంలో ఫీజును ఆశగా చూపింది.

జస్టిస్‌ నిమ్మగడ్డ లేదా జస్టిస్‌ అడుసుమిల్లి..
ప్రస్తుతం హైకోర్టుకు దసరా సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసులను విచారించేందుకు న్యాయ­మూర్తులు జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, జస్టిస్‌ జ్యోతిర్మయిలు వెకేషన్‌ జడ్జీలుగా ­వ్యవ­హ­రిస్తున్నారు. జస్టిస్‌ జ్యోతిర్మయి విచారణ నుంచి తప్పుకుంటే చంద్రబాబు బెయిల్‌ పిటిషన్, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లు జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు లేదా జస్టిస్‌ అడుసుమిల్లి రవీంద్ర బాబు ముందుకు వస్తాయి. చంద్రబాబు అండ్‌ కో కూడా ఇదే ఉద్దేశంతో మూర్తితో వకాలత్‌ దాఖలు చేయించి తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది.

అయితే జస్టిస్‌ నిమ్మగడ్డ లేదా జస్టిస్‌ అడుసుమిల్లిల్లో ఎవరికి చంద్రబాబు కేసును అప్పగించాలన్నది పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సెలవులు కావడంతో సీజే అందుబాటులో లేరు. సోమవారం నుంచే హైకోర్టు తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఎప్పుడైతే జస్టిస్‌ జ్యోతిర్మయి ఈ వ్యాజ్యాలను సోమవారం నాడు విచారణకు వచ్చేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారో అప్పుడే చంద్రబాబు అండ్‌ కో గతుక్కుమంది. అప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు హాలులో ఉన్న మరో సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వెంటనే జోక్యం చేసుకున్నారు.

సోమవారం అనే పదాన్ని ఉత్తర్వుల నుంచి తొలగించాలని జస్టిస్‌ జ్యోతిర్మయిని కోరారు. కేసును తగిన బెంచ్‌ ముందు ఉంచేందుకు వీలుగా ఫైల్‌ను సీజే ముందు ఉంచాలని మాత్రమే ఉత్తర్వుల్లో పేర్కొనాలన్నారు. లేకపోతే రిజిస్ట్రీ ముందు తాము సీజే అనుమతి కోసం అభ్యర్థించలేమన్నారు. అయితే వారి అభ్యర్థన పట్ల న్యాయమూర్తి జోతిర్మయి సుముఖత వ్యక్తం చేయలేదు. రిజిస్ట్రీ ముందు అత్యవసర విచారణ నిమిత్తం అభ్యర్థించేందుకు ‘సోమవారానికి విచారణ వాయిదా’ అనేది ఎంత మాత్రం అడ్డంకి కాదని తేల్చిచెప్పారు.

చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవచ్చునని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో చేసేదేమీ లేక చంద్రబాబు న్యాయవాదులు ఉసూరుమంటూ కోర్టు బయటకు వచ్చారు. ఆ వెంటనే రిజిస్ట్రార్‌ వద్దకు వచ్చారు. చంద్రబాబు బెయిల్‌ను మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా సీజే అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రార్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినా వారి పప్పులు ఉడకలేదు.

19 నుంచే వ్యూహానికి పదును..
కాగా వాస్తవానికి చంద్రబాబు అండ్‌ కో ‘నాట్‌ బిఫోర్‌’ అస్త్రాన్ని తన బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రయోగించాలని గతంలోనే నిర్ణయించింది. అయితే దానిని ఈ నెల 19న నుంచే అమలు చేయడం ప్రారంభించింది. 19న చంద్రబాబు బెయిల్‌ పిటిషన్, మధ్యంతర బెయిల్‌ కోసం వేసిన అనుబంధ పిటిషన్‌ జస్టిస్‌ సురేష్‌రెడ్డి ముందుకు వచ్చాయి.

చంద్రబాబు అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాదులు లూథ్రా, దమ్మాలపాటి గట్టిగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని, సుప్రీంకోర్టు చంద్రబాబు చేసిన మధ్యంతర బెయిల్‌ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించలేదని జస్టిస్‌ సురేష్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ పట్ల సానుకూలంగా స్పందించని నేపథ్యంలో తాను కూడా మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేనని జస్టిస్‌ సురేష్‌రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. దీంతో భోజన విరామం తర్వాత వ్యూహాన్ని మార్చేసిన చంద్రబాబు న్యాయ­వాదులు బెయిల్‌ పిటిషన్, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను వెకేషన్‌ కోర్టు ముందు పోస్ట్‌ చేయాలని న్యాయమూర్తిని కోరారు. ఇందుకు జస్టిస్‌ సురేష్‌రెడ్డి అంగీకరించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 

పలుకుబడితో ముందే తెలుసుకుని..
కాగా చంద్రబాబు న్యాయవాదులు తమ వ్యూహం ఎందుకు మార్చుకున్నారంటే వెకేషన్‌ కోర్టుల్లో ఎవరెవరు జడ్జీలు ఉండబోతున్నారో తమ పలుకుబడిని ఉపయోగించి ముందుగానే తెలుసుకోగలిగారు. ఆ వెకేషన్‌ కోర్టులో జస్టిస్‌ జ్యోతిర్మయి కూడా ఉన్నారని నిర్ధారించుకున్నారు. వాస్తవానికి వెకేషన్‌ కోర్టులో ఏ న్యాయమూర్తులు ఉండబోతున్నారనది చివరి నిమిషం వరకు బయటకు వచ్చే అవకాశం ఉండదు.

అయితే వ్యవస్థలను మేనేజ్‌ చేయగలిగిన చంద్రబాబు అండ్‌ కో వెకేషన్‌ కోర్టులో ఎవరెవరు ఉండబోతున్నారో ముందుగానే తెలుసుకుంది. దానికి అనుగుణంగానే తమ వ్యూహాలకు పదును పెట్టింది. జస్టిస్‌ జ్యోతిర్మయి ముందు ఎవరెవరు నాట్‌ బిఫోర్‌గా ఉన్నారో తెలుసుకోగలిగింది. నలుగురు న్యాయవాదులు ఉన్నట్లు తెలుసుకుని, అందులో తమ సామాజిక వర్గానికే చెందిన జీఎల్‌ఎన్‌ మూర్తితో ఆట మొదలుపెట్టింది. అయితే ఆటలో చివరకు ఓటమే ఎదురైంది. 

నైతిక విలువలకు కట్టుబడ్డ జస్టిస్‌ జ్యోతిర్మయి
కాగా మూర్తి సతీమణి ఇందిరా ప్రియదర్శిని కింది కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. న్యాయాధికారి కావడంతో ఎంతో కాలంగా ఆమె జస్టిస్‌ జ్యోతిర్మయికి తెలుసు. తనకు మూర్తి సతీమణితో పరిచయం ఉన్న నేపథ్యంలో హైకోర్టులో మూర్తి తన ముందు దాఖలు చేసే కేసులను విచారించకూడదని నైతిక విలువలకు కట్టుబడి జస్టిస్‌ జ్యోతిర్మయి నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా మూర్తిని తన నాట్‌ బిఫోర్‌ జాబితాలో చేర్చారు. అయితే ఆమె నైతిక విలువలనే చంద్రబాబు ఓ అవకాశంగా మలుచుకున్నారు.

ఆమె ముందు తన బెయిల్‌ పిటిషన్‌ రాకుండా చేసేందుకు మూర్తితో చంద్రబాబు విజయవంతంగా వకాలత్‌ దాఖలు చేయించారు. మూర్తి వకాలత్‌ వేస్తే ఆ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్‌ జ్యోతిర్మయి నిరాకరిస్తారని తెలిసే ఆ పని చేశారు. నిబంధనల ప్రకారం వెళితే చంద్రబాబుకు బెయిల్‌ దొరకడం కష్టమని ఆయన తరఫు న్యాయవాదులకు బాగా తెలుసు. అందుకే తమకే సొంతమైన ‘నాట్‌ బిఫోర్‌’ అస్త్రాన్ని బయటకు తీశారు.

మూర్తి దాఖలు చేసిన కేసును విచారించనని జస్టిస్‌ జ్యోతిర్మయి ఓపెన్‌ కోర్టులో చెప్పడంతో చంద్రబాబు అండ్‌ కో తమ పాచిక పారిందని సంతోషించారు. అయితే ఇంతలోనే సీజే అనుమతి తీసుకుని చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లలో విచారణను సోమవారానికి వాయిదా వేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ జస్టిస్‌ జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చంద్రబాబు అండ్‌ కో బిత్తరపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement