కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధినేత పీఏ ఆదేశాలతో రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై బెదిరింపులకు దిగుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. మాట వినకుంటే హతమారుస్తామనే స్థాయికి దిగారు. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
సాక్షి, తిరుపతి: కుప్పంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఆగడాలకు అంతే లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఘనత వహించిన మనోహర్ తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నాడు. టీడీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిని బెదిరిస్తున్నాడు. అందులో భాగంగా కుప్పం మండలం వి.మిట్టపల్లె పంచాయతీకి నామినేషన్ వేసిన వైఎస్సార్‌సీపీ అభిమాని అంజలికి హెచ్చరికలు జారీ చేశాడు. టీడీపీ మద్దతుతో పోటీచేస్తున్న శివలక్ష్మి భర్త మంజునాథ్‌తో కలిసి అంజలి ఇంటికి వెళ్లి మరీ దాడికి పాల్పడ్డాడు. నామినేషన్ ఉపసంహరించుకోకుంటే చంపేస్తామని బెదిరించాడు. దీనిపై శుక్రవారం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.
దందాల్లో ఆరితేరాడు
చంద్రబాబు పీఏ మనోహర్ కుప్పం కేంద్రంగా పలమనేరు, మరి కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వ్యవహారాలను చూస్తుంటాడు. చంద్రబాబు అండతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రధానంగా రూ.1.6కోట్ల తిరుపతి గంగమ్మ ఆలయ నిధుల దుర్వినియోగం కేసుపై విచారణ సాగుతోంది. ఇదికాక పలు భూకుంభకోణాల్లో తన వంతు పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బెదిరింపుల పర్వం!
నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభిమానుల ఏకగ్రీవమయ్యే పంచాయతీల్లో మనోహర్ డబ్బు ఎరవేసి అనామకులతో నామినేషన్ వేయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే టీడీపీ మద్దతు అభ్యర్థులు బరిలో ఉన్నచోట్ల పోటీకి నామినేషన్ వేసిన వారిని బెదిరిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి ఆర్థిక వ్యవహారాల వరకు మనోహర్ చూసుకుంటున్నట్లు టీడీపీ నేతలే వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనా మనోహర్ ఆగడాలు శ్రుతి మించుతున్నాయని కుప్పంవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: ఇదేం.. బరితెగింపు నాయనా..!)
నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment