విజయనగరం క్రైమ్: నవమాసాలు మోసి భూమి మీదకు తీసుకువచ్చి ప్రపంచాన్ని పరిచయం చేసిన కన్నతల్లిని చూడాలని ఆ చిన్నారులు పరితపించారు. అమ్మను చూడాలనుకున్నదే తడవుగా నాన్నకు కూడా చెప్పాపెట్టకుండా బస్సెక్కి విజయనగరం పట్టణానికి వచ్చేశారు. తరువాత వారి దగ్గర డబ్బుల్లేకపోవడంతో ఏం చేయాలో తెలియక పట్టణంలోని గంటస్తంభం, బాలాజీ కూడలి ప్రాంతాల్లో సంచరిస్తుండగా రాత్రి గస్తీ నిర్వహిస్తున్న ఎస్సై దుర్గాప్రసాద్ గుర్తించి, ఆకలి తీర్చి కుటుంబ వివరాలు తెలుసుకుని చిన్నారులను వారి అమ్మమ్మకు అప్పగించారు. హృదయాలను కదిలించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నిండా పదేళ్లు లేని ఇద్దరు చిన్నారులు రాత్రివేళ రోడ్లపై ఆకలితో తిరుగుతున్నారు.
పదినిమిషాల క్రితమే గంటస్తంభం నుంచి బాలాజీ కూడలి వైపు నడుచుకుంటూ వచ్చారని, ఎవరో తెలియదని స్థానికులు చెప్పడంతో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న వన్‌టౌన్ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ చిన్నారులను గుర్తించి దగ్గరికి వెళ్లి ముందు వారి ఆకలి తీర్చారు. అనంతరం వివరాలు ఆరా తీయగా తమ పేర్లు ప్రేమ్ (9), రూప (8) అని, తల్లిదండ్రులు విడిపోయారని, తండ్రి కోటి తెర్లాం మండలం ఉద్దవోలులో ఉంటాడని, తల్లి వెంకటి విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం బుచ్చయ్యపేటలో ఉంటుందని ఏడుస్తూ చెప్పారు.
కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో పిల్లలు తండ్రివద్దనే ఉంటూ చదువుకుంటున్నారు. తల్లిని చూసి చాలా రోజులు కావడంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా బస్సెక్కి వచ్చేశారు. మంగళవారం రాత్రి విజయనగరం వచ్చిన వారిద్దరూ పలుచోట్ల తిరుగుతూ బుధవారం రాత్రి ఎస్సై దృష్టిలో పడడంతో వివరాలు తెలుసుకుని జి.మాడుగుల మహిళా సంరక్షణ పోలీసులకు ఫోన్ చేసి తల్లి అడ్రస్ సేకరించి, చిన్నారుల అమ్మమ్మ ఈశ్వరమ్మకు సమాచారం అందించారు. దీంతో ఆమె గురువారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకోగా పిల్లలను అప్పగించారు. ఈ విషయంలో ఎస్సై, వన్‌టౌన్ సిబ్బంది చేసిన సేవలను పట్టణ ప్రజలు ప్రశంసించారు.
(చదవండి: దారి చూపిన ప్రభుత్వం)
Comments
Please login to add a commentAdd a comment