
చిత్తూరు అర్బన్: కరోనా కాలంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ పనిచేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే మాయమాటలు నమ్మి పలువురు మహిళలు మోసపోయారు. ఆన్‌లైన్ గేమింగ్స్ ఆడుతూ అందులో పెట్టుబడి పెట్టి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. వీరు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారించిన చిత్తూరు పోలీసులు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జి.శివకేశవ్ (33), రాగాల కృష్ణ చైతన్య (35), బచ్చు కిరణ్ (29), పరస శివప్రసాద్ (32)లను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను చిత్తూరు క్రైమ్ సీఐ రమేష్ మీడియాకు గురువారం వివరించారు.
మోసాలకు పాల్పడతారు ఇలా...
గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన బొబ్బిలి నవకిషోర్ అనే యువకుడు ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఇతను పలు ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌ను (ఏపీకే ఫైల్స్) రూపొందించాడు. ఇంట్లో ఉంటూ వర్క్‌ఫ్రమ్ చేసుకుంటూ ఆదాయానిచ్చే మార్గాలు చెబుతానంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. వాటిని గమనించిన పలువురు మహిళలు వాట్సాప్ మెసేజ్ ద్వారా నవకిషోర్‌ను సంప్రదించగా ఓ ఆండ్రాయిడ్ ఫైల్‌ను పంపి, లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్‌లోకి ప్రవేశించేలా చేశాడు. ఇక్కడ తొలుత రూ.10, రూ.50 పెట్టుబడి పెట్టమని చెబుతూ బెట్టింగులు ఆడిస్తూ రూ.700 వరకు లాభం వచ్చేలా..ఈ మొత్తం గేమింగ్ ఆడేవారి బ్యాంకు ఖాతా ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాడు. ఓ దశలో గేమింగ్ ఆడేవారి వద్ద రూ.50 వేలు ఉన్నా..దాన్ని నగదుగా మార్చుకునే అవకాశం ఉండదు. ఈ మొత్తం విత్‌డ్రా కావాలంటే బెట్టింగ్ కొద్దిగా పెంచాలని చెబుతూ దశల వారీగా రూ.వేలకు వేలు గేమింగ్‌లో పెట్టుబడి పెట్టించాడు.
అరెస్టైన శివకేశవ్, కృష్ణచైతన్య, కిరణ్, శివప్రసాద్
బాధితులు గేమింగ్‌లో పెట్టిన డబ్బులను కాజేయడానికి ఫిలిప్పీన్స్‌లో పైలట్ శిక్షణ తీసుకుని ఇటీవల తన సొంతూరుకు వచ్చిన ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేటకు చెందిన జి.శివకేశవ్‌ను రంగంలోకి దించాడు. బీటెక్ చదువుకున్న శివకేశవ్ తన స్నేహితులైన కృష్ణచైతన్య, కిరణ్ ద్వారా చీరాలలో షెల్‌టైల్ ఇన్‌ఫో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించి దాదాపు 100 మంది నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ ద్వారా వారిపేరిట సిమ్‌కార్డులు కూడా తీసుకున్నాడు. ప్రభుత్వ పథకాలు తీసుకోవడానికి కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తామంటూ ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాలు తెరచి, వాటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నవకిషోర్‌కు అందజేశాడు. ఇలా చేసినందుకు ఒక్కో బ్యాంకు ఖాతాకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చొప్పున నవకిషోర్ ద్వారా శివకేశవ్ అతని స్నేహితులకు అందింది.
తుదిగా గేమింగ్‌లో బాధితులు జమచేసిన నగదును ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా నవకిషోర్ తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఈ గేమింగ్ ఉచ్చులోకి చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన మానస, బంగారుపాళ్యంకు చెందిన టి.హేమలత, చిత్తూరుకు చెందిన హర్షితలు చిక్కుకుని గత నాలుగు నెలల్లో రూ.3.10 లక్షలు మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ విభాగం నిందితులైన శివకేశవ్, కృష్ణచైతన్య, కిరణ్, శివప్రసాద్‌లను చిత్తూరులో అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరైన మానస వెచ్చించిన రూ.61,500ను తిరిగి ఆమె ఖాతాకే పోలీసులు వేయించారు. నకిలీ ఖాతాల్లో ఉన్న రూ.5.13 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు నవకిషోర్‌ను అరెస్టు చేయడానికి లుక్ అవుట్ నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో బాధితులు, మోసగాళ్లకు అసలు పరిచయాలు లేకపోవడం, ఒక్కసారి కూడా ఫోన్‌లో మాట్లాడుకోకపోవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment