ఎస్‌ఐ శ్రావణి(ఫైల్)
సాక్షి, గుంటూరు: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చుండూరు ఎస్‌ఐ పిల్లి శ్రావణి(35) బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. గత శనివారం చుండూరు పోలీస్ స్టేషన్‌లోనే పనిచేస్తున్న కానిస్టేబుల్ రవీంద్ర, ఎస్‌ఐ శ్రావణి గడ్డి మందు కూల్ డ్రింక్‌లో కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన శ్రావణి 2018లో ఎస్‌ఐగా పోలీస్ శాఖలో అడుగుపెట్టారు. జిల్లాలోని అడవులదీవి, నరసరావుపేట దిశ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించారు. దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఏడు నెలల కిందట చుండూరుకు బదిలీపై వెళ్లారు. ఎస్‌ఐ మృతదేహానికి జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.
సీఐపై ఆరోపణలు
చుండూరు సీఐ రమేశ్‌బాబు, టీడీపీ నాయకుడు వంపుగాని గురవయ్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్‌ఐ శ్రావణి వాంగ్మూలం ఇచ్చారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీకి చెందిన కొందరిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేయగా ఆ వ్యక్తులతో సీఐ తనపై రిట్‌పిటీషన్‌లు వేయించడంతో పాటు, ఎస్‌ఈసీకి ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయించారని పేర్కొన్నారు. తనకు కానిస్టేబుల్ రవీంద్రతో అక్రమ సంబంధం ఉందని గురవయ్య ద్వారా సీఐ దుష్ప్ర చారం చేయించారని, ఎస్పీకి ఫిర్యాదులు చేయించి ఇబ్బంది పెట్టినట్టు ఎస్‌ఐ తెలిపారు. స్టేషన్‌లో తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందికి, తనకు మోమోలు ఇవ్వడంతో పాటు, లంచాలు తీసుకుంటున్నట్టు అసత్య ప్రచారం చేశారని, పై అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయడంతో వృత్తిపరంగా, మానసికంగా వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
ఇద్దరి మధ్య వివాదం
ఎస్‌ఐ శ్రావణి తొలి నుంచి తప్పుని సహించరని పోలీస్ శాఖలో పేరుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆమెపై ఎస్‌ఈసీకి, కోర్టుల్లో, ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులపై అనేక విచారణలను ఎదుర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఎస్‌ఐ శ్రావణి, సీఐ రమేశ్‌బాబు మధ్య వివాదం నడుస్తోందని, ఇద్దరు పర్సపరం వాదులాడుకునేవారని సమాచారం. స్టేషన్ సిబ్బంది సైతం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల విచరణలో తెలిపినట్టు తెలుస్తోంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి నట్టు డీఎస్పీ శ్రవంతిరాయ్ తెలిపారు.
సీఐను వీఆర్‌కు పిలిచాం
ఎస్‌ఐ శ్రావణి ఆత్మహత్య ఘటనపై ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా చుండూరు సీఐ రమేశ్‌బాబును వీఆర్‌కు పిలిచాం. శాఖపరమైన దర్యాప్తు చేపడతాం.
– డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, డీఐజీ, గుంటూరు రేంజ్
చదవండి:
గుంటూరు, నరసరావుపేటల్లో చంద్రబాబుపై కేసులు
ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’
Comments
Please login to add a commentAdd a comment