సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్‌కౌంటర్ ఘటనలో గాయపడిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, అరవింద్‌గౌడ్‌లకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్ న్యూరోసర్జన్ పి.విశ్వక్‌సేన్‌రెడ్డిని సిర్పుర్కర్ కమిషన్ గురువారం విచారించింది. కమిషన్ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ ఆయనను ప్రశ్నించారు. 2019 డిసెంబర్ 6న ఉదయం 8 గంటలకు కేర్ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు స్పృహలోనే ఉన్నారని విశ్వక్‌సేన్‌రెడ్డి వివరించారు.
కుడి కను బొమ్మపై 2 సెంటీమీటర్ల పొడవు గాయమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు.. ఆస్పత్రి అత్యవసర సేవల విభాగంలో పారాసెటమాల్ ఇచ్చామని, కడుపులోని మంటను తగ్గించే పాంటోప్, ఐవీ ఫ్లూయిడ్స్‌తో చికిత్స చేశామని కమిషన్‌కు తెలిపారు. ఇవి తప్ప వేరే ఏ రకమైన చికిత్స చేయలేదని, దీనిని రికార్డ్‌లోనూ నమోదు చేశామని వివరించారు. నొప్పి, వాపును తగ్గించే వోవెరాన్, టీటీ ఇంజెక్షన్లను కానిస్టేబుల్ బయటే ఇప్పించుకున్నారని, కేర్ ఆస్పత్రిలో ఇవ్వలేదని తెలిపారు. గాయం 2 సెంటీమీటర్లు ఉన్నట్టుగా ఎలా లెక్కించారని కమిషన్ ప్రశ్నించగా.. గాయాన్ని కొలిచే ఉపకరణం (క్యాలిబర్) తన వద్ద లేదని, కేవలం ఓ అంచనాతోనే చెప్పానని, దాన్నే రికార్డ్‌లో నమోదు చేశానని సమాధానమిచ్చారు.
‘సంచలనం సృష్టించిన లేదా మెడికో లీగల్ (ఎంఎల్‌సీ) కేసుల్లో డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రుల గాయాల గురించి స్పష్టంగా రాయాల్సి ఉంటుందని.. మరి మీరెందుకు నమోదు చేయలేద’ని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం సమాధానం చెప్పలేనంటూ డాక్టర్ విశ్వక్‌సేన్‌రెడ్డి దాటవేశారు. అంతర్గతంగా రక్తస్రావమైతేనే వ్యక్తి మరణిస్తారని, వేరే ఇతర సందర్భాల్లో అలా జరగదని చెప్పిన విశ్వక్‌సేన్.. కేర్ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లకు అలాంటి తీవ్ర గాయాలేవీ లేవని, సాధారణ గాయాలే ఉన్నాయని వివరించారు. షాద్‌నగర్ సీహెచ్‌సీ రికార్డ్‌లో కానిస్టేబుల్ స్పృహ కోల్పోయారని ఉందని, అందువల్లే ఐసీయూలో అడ్మిట్ చేశామని, అంతే తప్ప చికిత్సలో ఆ రికార్డులను అనుసరించలేదని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన రోజే ఉదయం 8:30 గంటలకు ఐసీయూలో చేర్చుకున్నామని.. మూడు రోజుల పాటు చికిత్స అందించామని తెలిపారు.
ఫోన్‌లో చెప్తే రికార్డ్‌లో నమోదు
మంగళవారం షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ (సీహెచ్‌సీ) సర్జన్ గోనె నవీన్ కుమార్ విచారణ అసంపూర్తిగా ముగియగా.. గురువారం ఉదయం తిరిగి కొనసాగించారు. కేర్ ఆస్పత్రి నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లకు సంబంధించిన డిశ్చార్జి సమ్మరీని ఎవరూ తన వద్దకు తీసుకురాలేదని.. ఎవరో ఫోన్‌లో చెబితే ఎంఎల్‌సీ రికార్డ్‌లో నమోదు చేశానని నవీన్‌కుమార్ తెలిపారు. డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రులకు ఎక్స్‌రే తీసినట్టు లేదని.. కానీ డాక్టర్స్ నోట్‌లో మాత్రం ఉందేమిటని ప్రశ్నించగా.. ‘డాక్టర్స్ నోట్‌ను ఇప్పుడే తొలిసారి చూస్తున్నా’నని నవీన్ సమాధానమిచ్చారు.
కేర్ ఆస్పత్రి రికార్డుల్లో అరవింద్‌గౌడ్‌కు ఎడమ భుజం మీద సన్నని వెంట్రుకలాంటి చీలిక ఏర్పడి ఉందని, దాన్ని మీరెందుకు షాద్‌నగర్ ఎంఎల్‌సీ రికార్డ్‌లో నమోదు చేయలేదని ప్రశ్నించగా.. డాక్టర్ నవీన్ సమాధానం ఇవ్వకుండా 15 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు నడుచుకుంటూ షాద్‌నగర్ సీహెచ్‌సీకి వచ్చారని నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ముందు వాంగ్మూలం ఇచ్చిన నవీన్ కుమార్.. త్రిసభ్య కమిటీ ముందు మాత్రం స్పృహ కోల్పోయి వచ్చారని తెలిపారు. పైగా ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఎన్‌హెచ్‌ఆర్సీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనలేదు. దీనిపై కమిషన్ ప్రశ్నించగా.. అన్నింటికీ ‘ఏమీ లేదు’అంటూ సమాధానం ఇచ్చారు.
నేడు సజ్జనార్ విచారణ
సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను సిర్పుర్కర్ కమిషన్ శుక్రవారం విచారించనుంది. ఈ మేరకు ఆయనకు తాజాగా సమన్లు జారీ చేసింది. వాస్తవానికి ఈనెల 4వ తేదీనే సజ్జనార్ విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు ఇతర సాక్షుల విచారణ సుదీర్ఘంగా కొనసాగడంతో సజ్జనార్ విచారణ వాయిదా పడింది. కమిషన్ మూడు రోజుల పాటు సజ్జనార్‌ను విచారించనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment