యశవంతపుర: సెల్ఫీ మోజులో ఎంతోమంది ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి. సెల్ఫీ వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు ఉన్నా పట్టించుకోకుండా విగతజీవులవుతున్నారు. బీదర్ నుండి వచ్చిన విద్యార్థులు నది వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారిపడి మరణించారు. బీదర్‌లోని కర్ణాటక కాలేజ్‌లో బీఏ విద్యార్థి పురుషోత్తమ పాటిల్, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి రక్షిత స్నేహితులు. రక్షిత గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదివేది. వీరిద్దరూ ప్రేమికులు కూడా. వరుస సెలవులు కావడంతో పర్యాటక యాత్రకు వచ్చారు. సోమవారం బాడుగ ఆటోలో దాండేలి నుండి జోయిడా వద్ద అంబికానగర గణేశ గుడి సమీపంలోని వంతెన వద్దకు వచ్చారు.
అక్కడ ఎవరూ లేని సమయంలో మొబైల్ ఫోన్‌లో ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకొంటుండగా జారి వంతెన పైనుండి కాళీ నదిలోకి పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. వంతెనపై దొరికిన మొబైల్ ఫోన్ ఆధారంగా యువతి కుటుంబసభ్యులకు కొందరు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఒడ్డుకు తెచ్చారు. బీదర్ జిల్లా రామనగర పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా వీరు నిజంగానే ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అని స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: కిరాతకం: అందరూ చూస్తుండగానే..
Comments
Please login to add a commentAdd a comment