బాలయ్య
పాపన్నపేట (మెదక్): భర్త చేసే చిల్లర దొంగతనాలతో విసిగి వేసారిందో? లేక రైతు బీమా డబ్బులకు ఆశపడిందో? తెలియదు గాని.. మెడలో మూడుముళ్లు వేసి తాళి కట్టిన భర్త గొంతుకు తాడు బిగించి చంపేసిందో భార్య. కనిపెంచిన కూతుళ్లు సైతం మానవత్వాన్ని మరచి తల్లికి సహకరించారు. గురువారం రాత్రి 8 గంటలకు ఈ దారుణం జరిగితే.. శుక్రవారం ఉదయం 8 గంటలకు బయటపడిన ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగరం గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. సీతానగరానికి చెందిన రైతు లంగడి బాలయ్య(56), కిసనమ్మ భార్యాభర్తలు. వీరికి రాధమ్మ, వినోద అనే కూతుళ్లు ఉన్నారు. కొడుకు మల్లేశ్ ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లకు గ్రామానికి చెందిన వారికే ఇచ్చి పెళ్లిళ్లు చేశాడు. కాగా, బాలయ్యను ఇంట్లో సరిగా చూడకపోవడంతో మద్యం సేవిస్తూ అప్పుడప్పుడూ చిల్లర దొంగతనాలు చేసేవాడు.
ఇటీవల ఈ కుటుంబం ఏడుపాయల ఆలయంవద్ద విందు చేసుకొని తిరిగి వస్తుండగా, అద్దెకు తీసుకెళ్లిన ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు యువకులు చనిపోయారు. దీంతో ట్రాక్టర్ యజమానితో కలసి బాలయ్య.. బాధిత కుటుంబాలకు రూ.2.50 లక్షల పరిహారం చెల్లించాడు. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. గురువారం గొడవ తీవ్రం కావడంతో భార్య కిసనమ్మ భర్త గొంతుకు తాడు బిగించగా.. మనవడు దుర్గేశ్, కూతుళ్లు రాధమ్మ, వినోదలు తలోవైపునకు లాగారు.
అనంతరం ఇంటి ముందు వీధిలోకి ఈడ్చుకొచ్చారు. అయితే 10వ తరగతి చదువుతున్న మరో మనవడు బాల్‌రాజ్.. తాతను చంపవద్దని ప్రాధేయ పడినప్పటికీ వారు వినలేదు. అప్పటికే బాలయ్య చనిపోవడంతో అంతా కలసి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు.
గ్రామస్తుల నిరసన
అమాయకుడైన బాలయ్యను అమానుషంగా చంపిన కుటుంబీకులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు నిందితుల ఇంటి ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాపన్నపేట ఎస్‌ఐ విజయ్, మెదక్ సీఐ విజయ్.. గ్రామస్తులకు నచ్చజెప్పి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇంటి ముందు బైఠాయించిన గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment