నాడు ఎన్సీబీ నేడు హెచ్‌-న్యూ!.. ‘డార్క్‌ వెబ్‌–డ్రగ్స్‌ దందా’ గుట్టు రట్టు | Dark Web Drugs Racket Busted In Hyderabad | Sakshi
Sakshi News home page

నాడు ఎన్సీబీనేడు హెచ్‌-న్యూ!  ‘డార్క్‌ వెబ్‌–డ్రగ్స్‌ దందా’ గుట్టు రట్టు

Published Sat, Sep 3 2022 9:13 AM | Last Updated on Sat, Sep 3 2022 9:13 AM

Dark Web Drugs Racket Busted In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: డార్క్‌ వెబ్‌ ద్వారా జరిగే డ్రగ్స్‌ దందా గుట్టురట్టు చేసి, నిందితులను అరెస్టు చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. సాంకేతిక అంశాలతో ముడిపడిన ఉన్న ఇలాంటి ఆపరేషన్లను దేశంలో ఇప్పటి వరకు కేంద్రం ఆదీనంలోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) మాత్రమే చేసింది. ఇతర ఏ రాష్ట్ర పోలీసులతో సహా ప్రత్యేక విభాగాలు చేపట్టలేకపోయాయి. ఎన్సీబీ చరిత్రలో ఇలాంటి ఆపరేషన్లు ఎనిమిది ఉండగా... దాని తర్వాత ఆ కేటగిరీలోకి హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) చేరింది. ‘డార్క్‌ వెబ్‌... క్రిప్టో కరెన్సీ... డెడ్‌ డ్రాప్‌’ పంథాలో నెట్‌వర్క్‌ నడిపిస్తున్న ఇద్దరు సరఫరాదారులు, ఆరుగురు పెడ్లర్లను గురువారం పట్టుకున్న విషయం విదితమే. 

25 మందితో 285కి చెక్‌... 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన, ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌–న్యూకు రూపమిచ్చారు. డీసీపీ చక్రవర్తి గుమ్మి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు పి.రాజే‹Ù, పి.రమేష్‌రెడ్డిలతో సహా మొత్తం 25 మందితో ఈ వింగ్‌ పని చేస్తోంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో వివిధ మాదకద్రవ్యాలకు సంబంధించిన 58 కేసులు నమోదు చేసింది. వీటిలో నిందితులుగా ఉన్న స్థానికులు, ఇతర రాష్ట్రాల/దేశాల వారితో కలిపి మొత్తం 285 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్యాలను హైదరాబాద్‌కు సరఫరా చేమంటూ పెద్దపెద్ద పెడ్లర్లే చేతులెత్తేసే స్థాయికి చేరింది. దీంతో అనేక మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి డ్రగ్స్‌ ఖరీదు చేసుకుని రావడం మొదలెట్టారు. 

ఐదో అంచెలోకి అడుగు.. 
ఈ విషయం గుర్తించిన హెచ్‌–న్యూ తన పంథా మార్చింది. స్థానికులు, ఇతర జిల్లాల వారిని పట్టుకుంటే సరిపోదని, డ్రగ్స్‌ దందాకు పూర్తిగా చెక్‌ చెప్పాలంటూ పరిధిని మరింత విస్తరించుకోవాలని భావించింది. దీంతో ఇతర రాష్ట్రాల్లోనూ దాడులు చేసి పెడ్లర్స్‌ను పట్టుకోవడం మొదలెట్టింది. దీనికి తోడు ఈ దందాలో ఉన్న విదేశీయులను డిపోర్టేషన్‌ ద్వారా వారి దేశాలకు తిప్పి పంపుతోంది. ఇలా ఇప్పటి వరకు ఐదుగురిని బలవంతంగా తిప్పి పంపింది. ఐదో అంచెలోకి అడుగు పెట్టిన హెచ్‌–న్యూ అత్యంత క్లిష్టమైన డార్క్‌ వెబ్‌పై పట్టు సాధిస్తోంది. దీని ఆధారంగా సాగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారాన్ని విచ్ఛిన్నం చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే గురువారం నాటి అరెస్టులు చోటు చేసుకున్నాయి. 

కొరియర్‌ సంస్థలతో సమావేశం.. 
నగరంలో డెలివరీ అవుతున్న మాదకద్రవ్యాల్లో ఎక్కువ శాతం కొరియర్‌ రూపంలోనే వస్తున్నాయి. ఈ విషయం గుర్తించిన సిటీ పోలీసులు వాటి నిర్వాహకులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందులో తమ దృష్టికి వచ్చిన కేసులను వివరించడంతో పాటు స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించనున్నారు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఉన్న సంస్థలపై చర్యలు తీసుకుంటారు. మరోపక్క ఈ డ్రగ్స్‌ ప్రధానంగా సౌతాఫ్రికా, డర్బన్‌ తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు భావిస్తున్నారు. వీటిని అడ్డుకోవడానికి కేంద్ర ఏజెన్సీలు, ఇతర విభాగాలతో కలిసి పని చేయాలని నగర పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ సమావేశం జరిగింది. త్వరలో మరో సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ నిర్ణయించారు.  

ఇతర విభాగాలకు అందులో శిక్షణ.. 
కేవలం డ్రగ్స్‌ దందాకు మాత్రమే కాదు అక్రమ ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా సహా అనేక అసాంఘిక కార్యకలాపాలకు డార్క్‌ వెబ్‌ అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇతర విభాగాలకు దీనిపై పట్టు ఉండేలా చేయాలని కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నిర్ణయించారు. దీనికోసం హెచ్‌–న్యూ సిబ్బందికి అదనపు శిక్షణ ఇప్పించడంతో పాటు వీళ్లు అటు టాస్క్‌ఫోర్స్, ఇటు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తర్ఫీదు ఇచ్చేలా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారికి రీహ్యాబ్‌ సంస్థల ద్వారా ఐదు దశల్లో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నారు. ఇప్పటి వరకు 488 మందికి వివిధ దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు.
చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement